ఏపీ స్టేట్ తైక్వాండో చాంపియన్‌గా శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా రెండు రోజులపాటు కన్నులపండువలా సాగిన ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ముగిశాయి. ఏపీ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణమండపం వేదికగా 39వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ కుర్గీ, 14వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ పూమ్‌సే బాలబాలికల తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించారు. మెగా టోర్నీలో ఓవరాల్ చాంపియన్‌గా శ్రీకాకుళం నిలవగా, రన్నరప్‌గా విజయనగరం జిల్లా, తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచా యి. ఆదివారం అర్ధరాత్రి వరకు పోటీలు కొనసాగాయి. తొలుత బాలురుకు పోటీలను పూర్తిచేయగా, ఆ తర్వాత బాలికల పోటీలను ముగించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలను అందజేశారు. విజేతలకు పలువురు ప్రజాప్రతినిధులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు) తదితరులు విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో తైక్వాండో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్‌టీ చంద్రమౌళి, తైక్వాండో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను, టోర్నీ ఆర్గనైజింగ్ కన్వీనర్ మజ్జి గౌతమ్, నౌపడ విజయ్‌కుమార్, వర్మ, వేణు, మాధురి, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, సామాజిక వేత్తలు ఒలింపిక్, పీఈటీ సంఘ నాయకులు, రిఫరీలు, టెక్నికల్ అఫీషియల్స్ తదితరులు పాల్గొన్నారు.


