
ఉపాధి కల్పన
ఉచిత
శిక్షణ..
ఎచ్చెర్ల: మండల కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో నిరుద్యోగ మహిళా యువతకు వివిధ ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రవేశపెట్టిన డీడీయూజీకేవై పథకం ద్వారా డొమైన్ (హోటల్ మేనేజ్‌మెంట్) రంగంలో శిక్షణ ఇస్తూ, అనంతరం మెరుగైన ఉపాధి అందిస్తున్నారు. ఆ ట్రేడ్‌కు సంబంధించిన శిక్షణ మాత్రమే కాకుండా, పలు నైపుణ్యాలను అందిస్తున్నారు. శిక్షణలో కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్‌పై అవగాహన, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం కల్పిస్తున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ రంగానికి మంచి డిమాండ్ ఉండడంతో శిక్షణ పూర్తి చేసిన వెంటనే ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. పదో తరగతి చదువుకుని 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారిని ఈ శిక్షణలో చేర్పించుకుంటున్నారు.
బ్యాచ్‌లుగా శిక్షణ
ఇక్కడ మూడు బ్యాచ్‌లుగా విడదీసి శిక్షణ ఇస్తున్నారు. మొత్తం బ్యాచ్‌కు 30 మంది చొప్పున 90 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం 72 మంది ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఎలా విధులు నిర్వర్తించాలి, ఎలా మెలగి ఉండాలనే విషయాలను ప్రాక్టికల్‌గా చేయించి చూపిస్తున్నారు. అంతేకాకుండా కంప్యూటర్ ల్యాబ్‌లో కంప్యూటర్ ఆపరేటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ వంటివి నేర్పిస్తున్నారు. ఈ శిక్షణలో మూడు నెలలు పాటు భోజనం, వసతి కల్పిస్తున్నారు. ఈ సమయంలో 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఆయా రంగాలకు సంబంధించి రెస్టారెంట్లకు తీసుకెళ్లి ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తున్నారు. అనంతరం శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పలు రెస్టారెంట్లలో, కంప్యూటర్ రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నారు.
అద్భుతమైన అవకాశం
పై చదువులు చదువుకోలేని వారికి ఈ శిక్షణ అద్భుతమైన అవకాశంగా మారింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకూ చదువుకుని, ఇంటివద్ద పరిస్థితులు బాగాలేని నిరుపేదలకు ఈ శిక్షణలు తోడుగా ఉంటున్నాయని పలువురు చెబుతున్నారు. ఈ శిక్షణలో చేరడానికి 18 సంవత్సరాలు నిండి పదో తరగతి వరకు చదువుకున్న మహిళలు అర్హులు కావడం వలన చదువు మధ్యలో ఆపివేసిన వారు ఎక్కువగా ఈ శిక్షణలో చేరుతున్నారు. ఉపాధితో ఆర్థికంగా ఇంటికి చేదోడుగా ఉండటానికి ఈ శిక్షణలు ఉపయోగకరంగా ఉన్నాయని చెబుతున్నారు.
ఉపాధి కోసం
ఉద్యోగం సంపాదించి ఇంటికి చేదోడుగా ఉండడానికి ఈ శిక్షణలో చేరాను. హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో శిక్షణ పొందుతున్నాను. ఇక్కడ హోటల్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇంగ్లిష్, కంప్యూటర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ చదువుకున్నాను. పై చదువులు చదవలేక ఖాళీగా ఉన్న సమయంలో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని జాయిన్ అయ్యాను. శిక్షణ అనంతరం ఉపాధి పొంది ఇంటికి నావంతు తోడుగా నిలుస్తాను.
– ఎ.జ్యోత్స్న, పెద్దరావుపల్లి,
లావేరు మండలం
మహిళల ఉపాధికి ఊతం
ఎచ్చెర్ల మహిళా ప్రాంగణంలో తర్పీదు
ప్రస్తుతం హోటల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ
కమ్యూనికేషన్ స్కిల్స్‌పై సైతం అవగాహన
శిక్షణ బాగుంది
ఇక్కడ ఉపాధి కోసం శిక్షణలో చేరాను. సంబంధిత శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఉపాధితో పాటు ఈ శిక్షణ చాలా రకాలుగా మాకు ఉపయోగపడుతోంది. శిక్షణ అనంతరం ఉపాధికి వెళ్లి కుటుంబానికి తోడుగా నిలవాలన్నదే నా కోరిక. – బి.సౌజన్య, లింగాలపేట,
ఎచ్చెర్ల మండలం
సౌకర్యాలతో కూడిన శిక్షణ
ఇక్కడ విద్యార్థులకు అన్నివిధాలుగా సౌకర్యాలతో కూడిన శిక్షణ అందిస్తున్నాము. ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో పాటు కంప్యూటర్ ల్యాబ్‌లతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోంది. శిక్షణ అనంతరం వివిధ కంపెనీలు, పెద్దపెద్ద హోటళ్లలో ఉపాధి కల్పించడం జరుగుతుంది.
– దన్నాన సంతోష్,
హోటల్ మేనేజ్‌మెంట్ శిక్షకులు

ఉపాధి కల్పన

ఉపాధి కల్పన

ఉపాధి కల్పన