వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా? | Chhattisgarh DSP Tasleem Arif wife Birth Day Viral Video | Sakshi
Sakshi News home page

వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?

Jun 15 2025 9:27 AM | Updated on Jun 15 2025 11:06 AM

Chhattisgarh DSP Tasleem Arif wife Birth Day Viral Video

రాయ్‌పూర్‌: ఆమె ఓ ప్రభుత్వ అధికారి భార్య. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మహిళ.. బాధ్యత మరిచిపోయి ఓవరాక్షన్‌ చేసింది. డీఎస్పీ సతీమణి.. తన పుట్టినరోజు సందర్భంగా చేసిన తప్పిదం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె.. ప్రభుత్వ వాహనం బ్యానెట్‌పై కూర్చుని కేక్‌ కట్‌ చేస్తూ.. వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఈ మ‌ధ్య కాలంలో తరచుగా కనిపిస్తూనే ఉంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం ఆరీఫ్ భార్య ఫ‌ర్హీన్ ఖాన్ త‌న పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉప‌యోగించడం వివాదాస్పదంగా మారింది. ఫ‌ర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా.. పోలీసు శాఖకు చెందిన వాహనం బ్యానెట్‌పై కూర్చొని కేక్ కట్ చేసింది.

ఇక, కేక్‌ కటింగ్‌ సందర్భంగా.. “స్నో స్ప్రే” తో వాహనం అద్దంపై “32” అని రాసింది. తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వైపర్స్‌తో దాన్ని తుడిచేశాడు. అనంత‌రం ఆమె మళ్లీ “33” అని రాస్తున్న దృశ్యాలు వీడియోలో క‌నిపించాయి. ఇదే సమయంలో కారు బ్యానెట్‌పై కేక్, పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. ఈ రీల్‌ వీడియోను సరగానా రిసార్ట్‌(Saragana Resort)లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక కారు అలా ముందుకు పోతుంటే బ్యానెట్‌పై డీఎస్పీ సతీమణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సదరు పోలీసు వాహనంలో మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. వారంతా ఎంజాయ్‌ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.

అయితే, సదరు అధికారి భార్య తన పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి. వ్యక్తిగత వేడుకల కోసం ఇటువంటి వాహనాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా బ్లూ బీకాన్(blue beacon) వంటి అధికార గుర్తింపు చిహ్నాలున్న వాహనాలను వినియోగించడం నేరంగా పరిగణిస్తారు. దీంతో, పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటివరకు సంబంధిత డీఎస్పీపై ఎలాంటి అధికారిక చర్య తీసుకోకపోవడం గమనార్హం.

 

Advertisement
 
Advertisement
Advertisement