
పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఇందులో పనిచేసే ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేస్తూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంటారని, దీన్ని దష్టిలో పెట్టుకొని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అతిథి గృహం ఆధునికీకరణను, వైద్య శిబిరాలను రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయటం వల్ల భూమి సమస్యలు లేని జిల్లాగా శ్రీకాకుళం రూపొందుతోందని చెప్పారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని రెవెన్యూ శాఖ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కె.శ్రీరాములు బి.వి.ఎస్.ఎన్.రాజు, పొదిలాపు శ్రీనివాసరావు, ప్రవళ్లిక, కలెక్టరేట్ పరిపాలన అధికారి గుడ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వైద్య శిబిరానికి విశేష స్పందన
రెవెన్యూ సర్వీసులు సంఘం, డాక్టర్ శశిధర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అన్నెపు శశిధర్, కార్టియాలజిస్టులు డాక్టర్ సాయితేజ బరాటం, డాక్టర్ పూజారి హరిబాబు, జనరల్ సర్జన్ డాక్టర్ చింతాడ గోవిందరావు, గైనకాలజిస్టు డాక్టర్ సనపల సుకన్య, ఆర్థోపెడిక్ డాక్టర్ కింతలికిషోర్, డాక్టర్ బమ్మిడి ప్రభులు వైద్య సేవలు అందించారు. ఆదివారం కూడా శిబిరం కొనసాగుతుందని డాక్టర్ శశిధర్ తెలిపారు. సీపీఆర్, బీఎండీ స్కాన్, థైరాయిడ్ పరీక్ష, డయాబెటిక్, యూరిక్ యాసిడ్, హిమోగ్లోబిన్, సర్వైకల్ కాన్సర్, బెస్టు క్యాన్సర్, ఈసీజీ, 2డీ ఎకో, జీఈఆర్‌డీ, బీఎంఐ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్