తాడిపత్రి రూరల్: ఎన్‌హెచ్ 67 రోడ్డు టెర్రర్‌గా మారుతోంది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో నిత్యం వాహనదారులు క్షతగాత్రులవ్వడమే కాక ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గురువారం యాడికి మండలం రాయలచెరువు పెట్రోల్ బంకు వద్దగల హైవే పక్కన నిలిపిన లారీని క్రూజర్ వాహనం ఢీ కొన్న సంఘటనలో తాడిపత్రికి చెందిన ఇరువురు, మండలంలోని కావేటిసముద్రానికి చెందిన మరో ఇద్దరు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అలానే ఐదుగురు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై లారీలు యథేచ్ఛగా పార్కింగ్ చేస్తుండడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ప్రమాదాలకు కారణమవుతున్న హై–బీమ్ లైట్లు
వాహనాల హెడ్‌లైట్ల వెలుతురు హైవేపై ఎదురుగా వచ్చే వాహనాల హై–బీమ్ లైట్ల కాంతి డ్రైవర్ల కళ్లపై నేరుగా పడినప్పుడు కొన్ని సెకండ్ల పాటు ముందున్న రోడ్డు సరిగా కనిపించదు. సరిగ్గా అదే సమయంలో రోడ్డు మార్జిన్‌పై సగం రోడ్డుపై నిలిపివున్న లారీలను గుర్తించే లోపే ప్రమాదాలు జరుగుతున్నాయి. మోటర్ వాహనాల చట్టం ప్రకారం జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలపరాదు. అత్యవసర వేళల్లో వాహనాలు మరమ్మతులకు గురైనప్పుడు, డ్రైవర్లకు విశ్రాంతి అవసరమైనా రోడ్డు మార్జిన్ దాటి సర్వీసు రోడ్డు, ట్రక్ లేబైల వద్ద మాత్రమే నిలపాలి. అలానే 50 మీటర్ల దూరంలో పార్కింగ్ లైట్లు వేయాల్సి ఉంది. వాహనాలకు వెనుక రెడీయం రిఫ్లెక్టర్లు ఉండాలి. హైవేలో ఎక్కడ ఈ నిబంధనలను లారీలు, ఇతర వాహనాలను పాటించడం లేదు. అలానే రాత్రివేళ పోలీసుల గస్తీ లేకపోవడం, ఆర్టీఏ అధికారులు ఊదసీన వైఖరి అవలంబిస్తుండడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదాలు జరిగినపుడు హడావుడి చేసి కేసులు నమోదు చేయడంతో చేతులు దులుపుకుంటున్నారు.
ఏడు బ్లాక్ స్పాట్లు
తాడిపత్రి – గుత్తి మార్గంలో ఏడు బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. హైవేలో కొత్తపేట హైవే బ్రిడ్జి, టి.కొత్తపల్లి – తొండపాడు, వెంగన్నపల్లి క్రాస్ – జక్కలచెరువు, వేములపాడు క్రాస్, రాయలచెరువు, కడప రోడ్డులోని బాలజీ డాబా, ఆర్‌సీఎం చర్చ్ – చుక్కలూరు పెట్రోల్ బంకుల వద్ద బ్లాక్ స్పాట్‌లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులు, వాహనాలకు రిఫ్లెక్టర్లు, బారికేడ్లు, వీధి దీపాలు, రోడ్డు మరమ్మతుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూ అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికై నా అధికారులు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ఎన్‌హెచ్–67పై తర చూ ప్రమాదాలు
హైవేపై ప్రయాణించాలంటే జంకుతున్న వాహనదారులు
ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పాలకులు
గురువారం రాయలచెరువు వద్ద జరిగిన ప్రమాదంతో హైవే నిర్వహణపై చర్చ
రోడ్డుపై వాహనాలు నిలుపుతుండడమే ప్రమాదాలకు కారణమంటూ
పలువురి మండిపాటు


