ప్రజల అంతిమ తీర్పు వైఎస్సార్‌సీపీకే | - | Sakshi
Sakshi News home page

ప్రజల అంతిమ తీర్పు వైఎస్సార్‌సీపీకే

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికారం అడ్డుపెట్టుకుని కూటమి ఎన్ని అరాచకాలకు పాల్పడినా ప్రజలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకే పట్టం కట్టారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామాల్లో ప్రచారం చేసినా, తాను ఒక్క గ్రామానికి కూడా ప్రచారానికి వెళ్లకపోయినా ప్రజలు వైఎస్సార్‌సీపీవైపే నిలిచారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా పార్టీ కార్యకర్తల సమష్టి కృషికి దక్కిన ఫలితమని, జగనన్నకు ప్రజలు పట్టం కట్టిన తీర్పు అని అభివర్ణించారు. నియోజకవర్గంలో 96 పంచాయతీల్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ ఏకగ్రీవం పేరుతో తన ఖాతాలోకి వేసుకుందని, మిగిలిన 94 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 43 పంచాయతీ సర్పంచు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలిచారన్నారు. టీడీపీ మద్దతుదారులు అధికారికంగా డిక్లరేషన్‌ పొందినవి 33 పంచాయతీలేనని, ఏకగ్రీవాలు, రిగ్గింగ్‌లు, స్క్రూటినీలో మేనేజ్‌ చేయడం, నామినేషన్ల అడ్డగింత వంటి చర్యలతో కలిపి 47 స్థానాలను గెలిచినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.

రిగ్గింగ్‌లు, బెదిరింపులు, దాడులే

టీడీపీ నైజం

రిగ్గింగ్‌లు, బెదిరింపులు, దాడులు చేసైనా సరే గెలవాలనేది అధికార టీడీపీ నైజమని ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే రామగిరి మండలం కొండాపురంలో రిగ్గింగ్‌, ఎంసీ పల్లిలో సైలెంట్‌ సైక్లింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలున్నా పేరూరు పంచాయతీలో అక్రమాలకు ప్రయత్నించినా చివరకు వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థే విజయం సాధించారని చెప్పారు. కనగానపల్లి మండలం రాంపురంలో రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారని, మహిళలపై దాడులను అడ్డుకున్న సీఐ శేఖర్‌పైనా తిరగబడ్డారని ఆరోపించారు. ఎస్పీపై కూడా రాళ్లదాడి జరిగిందన్నారు. కోనాపురం, నరసంపల్లి, పాతపాళ్యం, తగరకుంట, దాదులూరుతో పాటు పలు గ్రామాల్లో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. చెన్నేకొత్తపల్లి, న్యామద్దెలలో అధికారులను భయపెట్టి, ఏజెంట్లను బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. బీటెక్‌ చదివిన మహిళా అభ్యర్థిని పోలీసుల ఎదుటే అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పోలీసు అధికారుల వ్యవహార శైలి వల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తోందని విమర్శించారు.

మలి దశ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తాం

రెండు, మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌ చేస్తారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమి అరాచక పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. జగనన్న సంక్షేమ పథకాలను మిస్‌ అవుతున్నామని ఫీల్‌ అవుతున్నారన్నారు. మెజార్టీ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించి జగనన్నకు కానుకగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, బండి పవన్‌కుమార్‌, వరప్రసాద్‌రెడ్డి, మాదన్న యాదవ్‌, పాపంపేట ప్రసాద్‌రెడ్డి, ఈశ్వరయ్య, నీరుగంటి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

అధికార పార్టీ అక్రమాలను దాటుకుని ఘన విజయం

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమష్టి కృషికి దక్కిన ప్రతిఫలం

మలి విడతలోనూ క్లీన్‌ స్వీప్‌ చేస్తాం

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement