ఎన్‌పీకుంట: సున్నపుకుంట తండా గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ గోవిందునాయక్‌కు చెందిన నాలుగు జర్సీ ఆవులకు గుర్తు తెలియని దుండగులు గడ్డి మందుతాపి చంపేందుకు యత్నించిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాలు.. గురువారం రాత్రి గోవిందునాయక్ కుటుంబ సభ్యులు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆలస్యంగా ఇంటికి చేరుకోవడంతో పొలం వద్దకు వెళ్లలేకపోయారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు చేరుకొని ఆవులకు పాలు పితకడానికి ప్రయత్నించగా పాలు ఇవ్వకపోవడంతో పాటు అసహజంగా ప్రవర్తించాయి. అనుమానం వచ్చి పరిశీలించగా ఆవు మూతులకు గడ్డిమందు ఆనవాళ్లు కనిపించాయి. పశువైద్యుడికి సమాచారం అందించగా ఆయన అక్కడికి చేరుకుని ఆవులకు చికిత్స అందించాడు. మొత్తం 4 ఆవులకు విషప్రయోగం జరిగింది. ఘటనతో గోవిందునాయక్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తాను వైఎస్సార్‌సీపీ తరఫున క్రియాశీలకంగా వ్యవహరించడంతో కక్షగట్టి ఇలా చేశారని గోవిందునాయక్ వాపోయాడు.


