ఉద్యానం.. ఇలా చేస్తే భద్రం | - | Sakshi
Sakshi News home page

ఉద్యానం.. ఇలా చేస్తే భద్రం

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

పుట్టపర్తి అర్బన్‌: జిల్లావ్యాప్తంగా 40 వేల హెక్టార్ల మేర ఉద్యాన తోటలు విస్తరించాయి. మామిడి 20,540 హెక్టార్లు, చీనీ 15,257, జామ 520, దానిమ్మ 2,084, సపోటా 200, ఇతర పండ్ల తోటలు 850 హెక్టార్లలో సాగులో ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో నెలన్నర నుంచి వర్షాలు సక్రమంగా కురవని నేపథ్యంలో ఉద్యాన రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఫారం పాండ్లు తవ్వకం, చెట్ల మొదళ్లలో వీడ్‌ మ్యాట్లు ఏర్పాటు చేయడం, అంతర పంటలు సాగు చేయడం, మైక్రో ఇరిగేషన్‌ ఏర్పాటు చేసుకోవడంతో పాటు పీఎండీఎస్‌ పద్ధతిలో గుళికలు విత్తుకోవాలని సూచిస్తున్నారు.

ఫారంపాండ్లు..

పొలంలో ఫారం పాండు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటిని నిల్వ చేసుకొని కీలక సమయంలో పంటలకు వదులుకోవచ్చు. 20‘‘20‘‘3 సైజు ఫారం పాండుకు రూ.1.80 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో 50 శాతం సబ్సిడీ మొత్తం రూ.90 వేలు ప్రభుత్వం అందిస్తుంది. ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ కోతల సమయంలోనూ పంటలకు నీటిని పారబెట్టవచ్చు.

వీడ్‌మ్యాట్‌:

పండ్ల మొక్క చుట్టూ వీడ్‌ మ్యాట్‌ ఏర్పాటు చేసుకుంటే కలుపును నివారించవచ్చు. తేమ కూడా ఆవిరి కాకుండా ఉంటుంది. రసాయన మందులు కొట్టకుండా ఖర్చు తగ్గించుకోవచ్చు. సమయమూ ఆదా అవుతుంది. ఎండ అధికంగా ఉన్న సమయంలో వేడిని నియంత్రిస్తుంది. ఒక చదరపు అడుగుకు రూ.25 సబ్సిడీ అందజేస్తున్నారు. ఎకరాకు రూ. లక్ష వరకూ సబ్సిడీ పొందవచ్చు.

పీఎండీఎస్‌ గుళికలు..

చెట్ల కింద పీఎండీఎస్‌ విత్తన గుళికలు చల్లుకోవడంతో చెట్టుకు కావాల్సిన సారంతో పాటు వేడిని తగ్గిస్తుంది. వర్షాలు ఆలస్యమైనా చెట్టు ఎండిపోదు. పీఎండీఎస్‌ పద్ధతిలో 20 రకాల విత్తన గుళికలు అందుబాటులో ఉన్నాయి. సేంద్రియ ఎరువుగా దీన్ని ఉపయోగించవచ్చు.

మైక్రో ఇరిగేషన్‌..

మైక్రో ఇరిగేషన్‌తో తక్కువ నీటితోనే పండ్ల తోటలను కాపాడుకోవచ్చు. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలను కాపాడుకోవచ్చు. పెద్ద రైతులకు 75 శాతం, సన్న, చిన్న కారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్పు, స్ప్రింక్లర్లను అందజేస్తున్నారు.

పంటల బీమా పథకం..

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే బీమా ఆదుకుంటుంది. మరో 3 రోజులు మాత్రమే గడువు ఉంది. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో చీనీ, దానిమ్మ పంటలకు పరిహారం పొందవచ్చు.

కొత్తచెరువు మండలం తిరుమలదేవరపల్లి వద్ద ఓ రైతు తోటలో ఏర్పాటు చేసిన ఫారంపాండు

తాడిమర్రిలో చీనీ చెట్టు వద్ద ఏర్పాటు చేసిన వీడ్‌ మ్యాట్‌

ఎల్‌నినో నేపథ్యంలో కురవని వర్షాలు

జాగ్రత్తలు పాటించాలని

రైతులకు అధికారుల సూచన

సద్వినియోగం చేసుకోండి

ఉద్యాన రైతులు ఎల్‌నినో ప్రభావం నుంచి తప్పించుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే నెలన్నరకు పైగా వర్షాలు కురవలేదు. ఫారంపాండ్లు, వీడ్‌ మ్యాట్‌లు, మైక్రో ఇరిగేషన్‌, పీఎండీఎస్‌ పద్ధతితో పాటు పంటల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.

– జయకుమార్‌ బాబు, జిల్లా ఉద్యానశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement