డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో రూ.లక్ష జరిమానా | - | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో రూ.లక్ష జరిమానా

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

గోరంట్ల/పెనుకొండ రూరల్‌: తాగి వాహనం నడిపిన 10 మందికి రూ.లక్ష జరిమానా విధించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెనుకొండ, గోరంట్ల పోలీసులు ఆయా ప్రాంతాల్లో మంగళవారం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే తాగి వాహనాలు నడుపుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానాల్లో హాజరుపరిచారు. ఒక్కొక్కరి నుంచి రూ. 10 వేల చొప్పున మొత్తంగా రూ. లక్ష జరిమానా వసూలు చేశారు.

● గోరంట్ల వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున న్యాయమూర్తి జరిమానా విధించినట్లు సీఐ బోయ శేఖర్‌ తెలిపారు.

చెక్‌ బౌన్స్‌ కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు

హిందూపురం: చెక్‌ బౌన్స్‌ కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రమణయ్య మంగళవారం తీర్పు చెప్పారు. హిందూపురం పట్టణానికి చెందిన డాక్టర్‌ ఎం.మధుకర్‌ రెడ్డి టి.రంజిత్‌ కుమార్‌ అనే వ్యక్తితో రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. రుణం తిరిగి ఇవ్వమని కోరడంతో 2024 జనవరి 1న చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కును రంజిత్‌ కుమార్‌ బ్యాంకులో ఇవ్వగా, మధుకర్‌ రెడ్డి ఖాతాలో డబ్బు లేదని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో బాధితుడు హిందూపురం ప్రత్యేక కోర్టులో కేసు దాఖలు చేశాడు. పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి రమణయ్య.. నేరం రుజువు కావడంతో మధుకర్‌ రెడ్డికి 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 2 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, న్యాయస్థానంలో మధుకర్‌ రెడ్డి సస్పెన్షన్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో అనుమతించి విడుదల చేశారు.

కేజీబీవీలో టీచర్ల ఘర్షణ

ఎన్‌పీకుంట: స్థానిక కేజీబీవీ పాఠశాలలో ఇరువురు ఉపాధ్యాయినులు మంగళవారం గొడవ పడ్డారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు అసభ్య పదజాలంతో ఒకరినొకరు దూషించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై పాఠశాల ఎస్‌ఓ రిహానా మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో సోలార్‌ వాటర్‌ హీటర్‌ ఏర్పాటు గురించి కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా హిందీ ఉపాధ్యాయిని రూపారాణి తనపై దుర్భాషలాడిందని చెప్పారు. హిందీ ఉపాధ్యాయిని రూపారాణి మాట్లాడుతూ ఎస్‌ఓ రిహానా తన వ్యక్తిగత విషయాలను వేరే ఉపాధ్యాయిని ద్వారా అడిగించి బ్లాక్‌మెయిల్‌ చేసేలా వ్యవహరించడంతో సహనం కోల్పోయి దుర్భాషలాడినట్లు తెలిపారు. గతంలో కూడా పాఠశాలలో ఉపాధ్యాయినుల మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement