హిందూపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. హిందూపురం సమీపంలోని మణేసముద్రం వద్ద ఈ ఘటన జరిగింది. వివరాలు.. మండలంలోని రోకలిపల్లికి చెందిన గోవిందు (28) ఇంటికి సరుకులు తెచ్చేందుకు మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంలో హిందూపురానికి బయలుదేరాడు. మణేసముద్రం వద్ద ఏ–1 స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో బైకును క్యాంటర్ గూడ్స్ వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన గోవిందు అక్కడికక్కడే మృతి చెందాడు. హిందూపురం అప్‌గ్రేడ్ ఏఎస్‌ఐ శ్రీరాములు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య గంగరత్న, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
లాలేపల్లిలో నెమళ్ల మృత్యువాత?
చిలమత్తూరు: మండల పరిధిలోని లాలేపల్లిలో నెమళ్లు పదుల సంఖ్యలో మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టుగా చర్చ సాగుతోంది. విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలు మధ్యవర్తిత్వం వహించి సెటిల్‌మెంట్ చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
గుంతకల్లులో
కరోనా కలకలం
గుంతకల్లు/ గుంతకల్లు టౌన్: కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. సెకండ్ వేవ్ తర్వాత తొలిసారి జిల్లాలో వెలుగు చూసిన కేసు కలకలం రేపింది. గుంతకల్లులోని బెంచ్ కొట్టాలకు చెందిన 64 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంతకల్లు రైల్వే ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో మూడు రోజులుగా శ్వాసకోశ సమస్యతోపాటు జర్వంతో బాధపడుతున్న వృద్ధురాలిని కుటుంబ సభ్యులు రైల్వే ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు మంగళవారం ర్యాపిడ్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు విషయాన్ని జిల్లా వైద్యాధికారులకు తెలియజేయడంతో పాటు వృద్ధురాలిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. సమాచారం అందుకున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు సాయంత్రం బాధితురాలిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వృద్ధురాలికి ర్యాపిడ్ టెస్ట్ ద్వారా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఆమెతో పాటు ఇంట్లో ఉంటున్న కుమారుడికి నెగిటివ్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం వృద్ధురాలు యాక్టివ్‌గానే ఉన్నారని, ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


