కదిరి అర్బన్: తమ గ్రామంలో మూతపడిన పాఠశాలను పునఃప్రారంభించాలని కదిరి మండలం బడవాండ్లపల్లికి చెందిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఎంఈఓ చెన్నక్రిష్ణను కలిసి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో తమ పిల్లలు సుదూరంలో ఉన నల్లచెరువు మండలం తూపల్లి పాఠశాలకు అవస్థలు పడుతూ వెళ్తున్నారని వాపోయారు. ప్రతి రోజూ రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎంఈఓ చెన్నక్రిష్ణ పేర్కొన్నారు.
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తనిఖీ
ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని తరగతి గదులతోపాటు రికార్డులు పరిశీలించారు. కళాశాలలో సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వనితవాణి, విద్యాశాఖ సహాయకుడు మారుతీరావు పాల్గొన్నారు.
పట్టపగలే ఇంట్లో చోరీ
గుడిబండ: మండల పరిధిలోని దిన్నెహట్టి గ్రామంలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... దిన్నెహట్టికి చెందిన కరియన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పొలంలోకి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వారు తాళాన్ని ఎవరో పగులగొట్టినట్లు గుర్తించారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా, బీరువాలోని జత కమ్మలు, రెండు ఉంగరాలు, రెండు చైన్లు, రూ.50 వేలు కనిపించలేదు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ రమేష్‌బాబు ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఎస్‌ఐ అనిల్ కుమార్ ఇంట్లో వేలిముద్రలను సేకరించారు. బాధితుడు కరియన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భార్యాభర్తల మధ్య గొడవ
● పోలీస్ స్టేషన్ ఎదుట భర్త
ఆత్మహత్యాయత్నం
మడకశిర: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరికి పోలీసుస్టేషన్‌కు చేరింది. ఈ క్రమంలోనే భర్త బ్లేడుతో శరీరాన్ని కోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వివరాలు.. మడకశిర మండలం యూ.రంగాపురం గ్రామానికి చెందిన సోమశేఖర్, శశికళ భార్యాభర్తలు. చాలాకాలం బెంగళూరులో జీవనం సాగించిన వీరు ఇటీవల సొంత గ్రామానికి వచ్చారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం మళ్లీ గొడవ పడడంతో భార్య శశికళ మడకశిర పోలీస్ స్టేషన్‌కు వచ్చి సోమశేఖర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న సోమశేఖర్ బ్లేడుతో తన శరీరంపై ఎక్కడ పడితే అక్కడ కోసుకున్నాడు. పోలీసులు వెంటనే అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.
చెరువుల్లో పశుగ్రాసం
పెంపకానికి ప్రణాళిక
అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొన్నందున పశు, జీవసంపదకు గడ్డి కొరత ఏర్పడకుండా అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు చెరువుల్లో గ్రాసం పెంపకానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. రైతుల ద్వారా జొన్న విత్తనాలు చల్లించడానికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.


