మడకశిరరూరల్: మండలంలోని నీలకంఠాపురం గ్రామంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని ఆస్పత్రి వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి కోరారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డితో కలిసి సోమవారం ఆస్పత్రిని ఆయన సందర్శించారు. కంటి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి పొందుతున్న వారితో మాట్లాడారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ప్రారంభించిన ఏడు నెలల్లోనే 25 వేల మందికి ఉచితంగా కంటి పరీక్షలు, 1,000 మంది దాకా ఆపరేషన్లు చేయించామన్నారు. ఆస్పత్రి పరిధిలో 9 కంటి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంటి చూపుతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య చికిత్సలు చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అనంతరం వైద్య సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి అభినందించారు.
కంటి వైద్య కేంద్రం ప్రారంభం
లేపాక్షి: పర్యాటక కేంద్రమైన లేపాక్షిలో ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం లేపాక్షిలోని అన్న ప్రసాద సేవా ట్రస్ట్ ఆవరణంలో కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఒక్క రూపాయి చెల్లించనవసరం లేకుండా కేంద్రంలో కంటి పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. ఎల్‌వీ ప్రసాద్ కంటి వైద్య కేంద్రం వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 280 కంటి వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్నింటి కంటే లేపాక్షిలోని కేంద్రం ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశముందన్నారు. కార్యక్రమంలో సేవామందిరం ట్రస్ట్ నిర్వాహకులు కేటీ శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ సయ్యద్‌నిస్సార్, వైస్ ఎంపీపీ అంజినరెడ్డి, మాజీ కన్వీనర్ నారాయణస్వామి, అన్నదాన సేవా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వక్క ఆకులతో వాటర్ బాటిల్
● మడకశిర విద్యార్థులను అభినందించిన ఉన్నత విద్యాశాఖ కమిషనర్
మడకశిర: పట్టణంలోని ఎస్‌వైటీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు వక్క ఆకులతో ఎకో ఫ్రెండ్లీ వాటర్ బాటిల్ ఆవిష్కరించారు. ఇటీవల మంగళగిరిలో ఉన్నత విద్యాశాఖ, రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్యాంపులో కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులు షాహిద్, చైత్ర, నవీన్‌కుమార్, అనిల్, రంజిత్ పాల్గొన్నారు. కళాశాల అధ్యాపకుడు డాక్టర్ చంద్రశేఖర్‌నాయక్ నాయకత్వంలో వక్క ఆకులతో ఎకో ఫ్రెండ్లీ వాటర్ బాటిల్‌ను ఆవిష్కరించి మన్ననలు పొందారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ నారాయణభరత్ గుప్తా విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు, అధ్యాపకుడు చంద్రశేఖర్‌నాయక్‌కు సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: కడుపునొప్పి తాళలేక యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వన్‌టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన మేరకు... పట్టణంలోని పార్థసారథి నగర్‌కు చెందిన ఆదినారాయణ కుమారుడు సంగాల మహేంద్ర (26) టైల్స్ పని చేస్తూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా మహేంద్ర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందించినా కడుపునొప్పి తగ్గలేదు. దీంతో మహేంద్ర మద్యానికి అలవాటు పడి ప్రతిరోజు మద్యం తాగేవాడు. ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం మహేంద్రకు కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న మాత్రలు వేసుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. సోమవారం ఉదయం తల్లి వెంకటరమణమ్మ బెడ్‌రూమ్ తలుపులు తీయగా కుమారుడు ఉరికి వేలాడుతూ కనిపించడంతో ఆమె బోరున విలపించింది. చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించగా అప్పటికే మహేంద్ర మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారంఅందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రెడ్డెప్ప తెలిపారు.


