రైతుకు ధీమా ఏదీ? | - | Sakshi
Sakshi News home page

రైతుకు ధీమా ఏదీ?

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటలు దెబ్బతింటే రైతులను అంతో ఇంతో ఆదుకుని ధీమా కల్పించేది పంటల బీమా. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పంటల బీమా పథకాలను అటకెక్కించేశారు. పంట నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వం నుంచి బీమా రూపంలో సాయం అందక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ప్రస్తుత సంవత్సరం ఎల్‌–నినో భయపెడుతోంది. ఈసారి వర్షాలు తక్కువగా పడతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈ నెల 7, 13, 14 తేదీల్లో కురిసిన మోస్తరు వర్షాలకే రైతులు పంటలు సాగు చేశారు. 15వ తేదీ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. ఈ వ్యవసాయ సీజన్‌ కష్టంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ధీమా కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. కనీసం పంటల బీమా పథకాలు అమలు చేసినా అంతో ఇంతో మేలు చేకూరే పరిస్థితి ఉన్నా... చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకాలు ఉన్నట్లా లేనట్లా అనేది ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు.

రైతులను దగా చేసిన బాబు సర్కార్‌..

చంద్రబాబు ప్రభుత్వం 2024 ఖరీఫ్‌లో ఉచిత పంటల బీమా పథకం అమలు చేసినా... పంట నష్టపోయిన రైతులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. అదే ఏడాది రబీ నుంచి ఉచిత బీమా పథకాలను రద్దు చేసి.. 35 వేల మంది రైతుల నుంచి ప్రీమియం వసూలు చేశారు. ప్రీమియం కట్టిన రైతులకు కూడా ఎలాంటి పరిహారం ఇవ్వకుండా దాటేశారు. 2025 ఖరీఫ్‌లో కూడా బీమా పథకాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మంది వరకు రైతులు రూ.కోట్లలో ప్రీమియం కట్టినా ఇప్పటికీ పైసా కూడా పరిహారం ఇవ్వకుండా దగా చేశారు. ఇక 2026 రబీలో అయితే పంటల బీమా పథకాలను పూర్తిగా రద్దు చేశారు. ఇలా గత రెండేళ్లలోనే పంటల బీమా పథకాలను నీరుగార్చడంతో రైతులకు పరిహారం రాకుండా చేశారు. రైతులు చెల్లించిన ప్రీమియానికి కేంద్రం తన వంతు మొత్తం జత చేసినా చంద్రబాబు ప్రభుత్వం సదరు కంపెనీలకు ఆ ప్రీమియం చెల్లించని కారణంగా బీమా పరిహారం రావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం 2026 ఖరీఫ్‌ నడుస్తోంది. పంట రుణాల రెన్యూవల్స్‌ 80 శాతం పూర్తయ్యాయి. బీమా పథకాల కింద ఏ పంటకు ఎంత ప్రీమియం కట్టాలి.. బీమా పథకాలు ఉన్నాయా లేదా అనేది కూడా అటు పాలకులు ఇటు అధికారులు చెప్పడం లేదు.

జగన్‌ హయాంలో ఉచిత పంటల బీమా..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యాక రైతులపై పైసా భారం మోపకుండా ప్రీమియం కూడా ప్రభుత్వమే భరించి.. నిబంధనల మేరకు బీమా కింద పరిహారం అందజేశారు. ఏటా ఖరీఫ్‌లో 12 రకాల పంటలు, రబీలో ఆరు రకాల పంటలకు అటు వాతావరణ బీమా, ఇటు ప్రధానమంత్రి ఫసల్‌బీమా పథకాలు వర్తింపజేశారు. ఈ–క్రాప్‌ ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేసి నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం వచ్చేలా చర్యలు తీసుకున్నారు. జగన్‌ ఐదేళ్ల హయాంలో అనంతపురం జిల్లా రైతులకు రూ.1,160.19 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా రైతులకు రూ.722.61 కోట్లు... వెరసి ఉమ్మడి జిల్లాకు ఏకంగా రూ.1,883 కోట్ల వరకు బీమా కింద ధీమా కల్పించినట్లు రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.

పంటల బీమా ఉన్నట్టా.. లేనట్టా..?

ప్రీమియం చెల్లింపుపై

నేటికీ స్పష్టత కరువు

బీమా కోసం ఎదురుచూస్తున్న రైతులు

నోరు మెదపని చంద్రబాబు ప్రభుత్వం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement