పుట్టపర్తి అర్బన్: జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్ సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న రెవెన్యూభవన్ (ఎస్‌ఆర్ శంకరన్ హాల్)లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించి ఫిర్యాదులు అందజేయడానికి సంబంధిత వేదికకు హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. www. meekosam. ap. gov. in అనే వైబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు. దీంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని సూచించారు. ఇకపై ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌ను రెవెన్యూ భవన్‌లోనే నిర్వహిస్తామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సైతం పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పోలీస్ కార్యాలయంలో...
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని సూచించారు.
గడువులోపు
పనులన్నీ పూర్తి చేయండి
పుట్టపర్తి: బుక్కపట్నంలోని సచివాలయంలో జరుగుతున్న ‘సర్’ కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం సచివాలయానికి వెళ్లి కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ, స్కానింగ్, వెరిఫికేషన్ ,ఎన్యుమరేషన్ ఫారాల అప్‌లోడింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఓటర్ల నమోదు, సవరణలు డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలన్నారు.
టాయ్ కరెన్సీతో మోసం
బత్తలపల్లి: అమాయకులను లక్ష్యంగా చేసుకొని రూ.200, రూ.500 టాయ్స్ కరెన్సీని చెలామణి చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గత నెలలోనే జిల్లా పోలీసులు లేపాక్షి మండలంలో రూ.50 లక్షల టాయ్ కరెన్సీని స్వాధీనం చేసుకొని నిందితులను కటకటాల్లోకి నెట్టారు. అయితే తాజాగా మళ్లీ బత్తలపల్లి మండలంలో టాయ్ కరెన్సీ లావాదేవీలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల కొందరు బత్తలపల్లిలోని కూడలిలో ఆటోవాలా వద్దకు వెళ్లి రూ.200 టాయ్ కరెన్సీ నోట్లు ఇచ్చారు. అలాగే జొన్నరొట్టెలు అమ్ముకునే వృద్ధురాలికి కూడా నోట్లు అంటగట్టారు. ఇలా చిరువ్యాపారులను టార్గెట్ చేసుకొని నోట్లను మార్పిడి చేస్తున్నారు. మొహరం వేడుకల్లో భాగంగా శనివారం పీర్లు భేఠీ సందర్భంగా వెంకటగారిపల్లి సత్రం వద్ద వ్యాపారులకు టాయ్స్ కరెన్సీని ఇవ్వాలని ప్రయత్నించినా వారు తిరస్కరించారు. దీంతో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. టాయ్ కరెన్సీతో మోసాలకు పాల్పడితున్న వారినిపై కఠిన చర్యలు తీసుకోవానలి ప్రజలు కోరుతున్నారు.


