పుట్టపర్తి అర్బన్: కేంద్ర ప్రభుత్వ సహకారంతో 0–5 సంవత్సరాల పిల్లలకు వేసే పోలియో చుక్కల లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చింది. పోలియో కేంద్రాలను సగానికి తగ్గించడంతో చిన్న గ్రామాలకు చెందిన చిన్నారులు, బాలింతలు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంచాయతీ కేంద్రాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది.
2037 నుంచి 1011 కేంద్రాలకు కుదింపు
జిల్లాలో 2025 డిసెంబర్ 21న పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు. అప్పట్లో 2,11,39 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సరిగ్గా ఏడు నెలలకు జిల్లాలో సుమారు 37,766 మంది చిన్నారులను తగ్గించి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,73,625 మంది చిన్నారులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే జిల్లాలో గతంలో 2037 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 1011 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. గత ఏడాది 8,140 మంది సిబ్బందిని నియమించగా ప్రస్తుతం 4,926 మందిని మాత్రమే నియమించారు. ఇందులో కేవలం వైద్య సిబ్బందిని మాత్రమే నియమించుకున్నారు. గతంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, ప్రభుత్వ టీచర్లు సేవలను వినియోగించుకునే వైద్యశాఖ ఈసారి మాత్రం ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను మాత్రమే వినియోగించారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే రెమ్యునరేషన్‌కు బడ్జెట్ లేదని సగం మంది సిబ్బందిని తొలగించినట్లు తెలిసింది.
కుగ్రామాల్లో కేంద్రాలేవీ?
జిల్లాలో పల్స్ పోలియో కేంద్రాలను కేవలం పంచాయతీ హెడ్ క్వార్టర్‌లలో మాత్రమే ఏర్పాటు చేశారు. చిన్న గ్రామాల్లో ఏర్పాటు చేయకుండా చిన్నారులతో పాటు బాలింతలు వారి కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేందుకు సుమారు ఐదారు కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లి పోలియో చుక్కలు వేయించాల్సిన దుస్థితి కల్పించారు. మండుటెండలో పిల్లలను ఎత్తుకొని సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి కేంద్రాలకు వెళ్లి చుక్కల మందును వేయించారు.
98 శాతం పూర్తి
ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలియో చుక్కల పంపిణీ సాయంత్రానికి 98.3 శాతం పూర్తయినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం తెలిపారు. ఉదయం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎనుములపల్లి పీహెచ్‌సీ పరిధిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడలాఫీసర్ డాక్టర్ నాగేంద్రకుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి చెన్నారెడ్డి, వైద్యాధికారి డాక్టర్ గాయత్రి పాల్గొన్నారు.
చిన్న గ్రామాల్లో కనిపించని
పల్స్ పోలియో కేంద్రాలు
వేరే గ్రామానికి వెళ్లి
చుక్కలు వేయించుకోవాల్సిన దుస్థితి
పిల్లల సంఖ్యనూ తగ్గించిన అధికారులు


