కదిరి టౌన్: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు లేదని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ అన్నారు. ఆదివారం కదిరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కందికుంట మాటెత్తితే తనది రికార్డ్ ట్రాక్ రికార్డ్ అని, డిస్ట్రిక్ట్ రికార్డ్ అని ఏవేవో గొప్పలు చెప్పుకుంటుంటాడన్నారు. అది నిజమేనని.. మీకున్న క్రిమినల్ ట్రాక్ రికార్డు రాష్ట్రంలో ఎవరికీ ఉండదన్నారు. సుప్రీంకోర్టులో కేసులు ఎందుకున్నాయో చెప్పాలన్నారు. డీడీల స్కాంలో నేరం రుజువు కావడంతో పాటు శిక్ష పడటం ఖాయమని స్పష్టం చేశారు. రైతుల గురించి హేళనగా మాట్లాడడం టీడీపీ నేతలతో పాటు సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే.. మీరేమో ప్రభుత్వ భూములను నమ్ముకొని రైతులు పశుగ్రాసం వేస్తారా అంటూ రైతులను కించపరిచే మాటలు మాట్లాడడం లేదా అని ప్రశ్నించారు. ఎన్‌పీ కుంటలో నూతన సోలార్ ప్లాంట్‌కు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. అంతే తప్ప రైతులకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేవలం మంత్రి పదవి కోసం తమ పార్టీ విమర్శిస్తున్నారని, కందికుంటకు మంత్రి పదవి వచ్చేది లేదు.. సచ్చేదిలేదన్నారు. ఇప్పటికై నా కందికుంట నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
కందికుంటపై వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త మక్బూల్ ఆగ్రహం


