రైతులకు కల్పతరువుగా నిలిచిన సీజీ ప్రాజెక్టు అభివృద్ధిని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా గాలికి వదిలేశారు. ప్రాజెక్టు నీటితో కళకళలాడితే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సీజీ ప్రాజెక్టు నీటితో నిండినప్పుడు మండలం నుంచే కాకుండా అన్నమయ్య జిల్లా మొలకలచెరువు, పీటీఎం, కందుకూరు, కర్ణాటకలోని చేలూరు, చాకివేలు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. అయితే ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి కనీసం సరైన రోడ్డు కూడా లేదు. ఉన్న మట్టి రోడ్డు మొత్తం రాళ్లు తేలిపోయి కనీసం నడవడానికి కూడా వీలు కాని దుస్థితికి చేరుకుంది. అలాగే పర్యాటకుల కోసం నిర్మించిన వాటర్ ఫౌంటేన్ నిర్వహణ లోపం కారణంగా నిరుపయోగంగా ఉంది. అలాగే సీజీ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణ కోసం ఏర్పాటు చేసిన రాజచిహ్నం ఉన్న రాతి స్తంభం ప్రహరీ కూలిపోయింది. పర్యాటకుల సౌకర్యం కోసం ప్రాజెక్టు సమీపంలో గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. అయితే గెస్ట్‌హౌస్ వినియోగంలో లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది.


