ఆయన ఇక్కడ ..‘కీ’ అక్కడ ! | - | Sakshi
Sakshi News home page

ఆయన ఇక్కడ ..‘కీ’ అక్కడ !

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

కదిరి: వారం రోజుల క్రితం బదిలీపై వెళ్లిన కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ ఇంత వరకూ ప్రస్తుత కదిరి మున్సిపల్‌ కమిషనర్‌ వి.సందీప్‌కు డిజిటల్‌ ‘కీ’ అప్పగించలేదు. ఆయన కదిరిలోనే ఉంటూ ఇప్పటికీ తానే కమిషనర్‌ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఫైళ్లన్నీ తన ఇంటికి తెప్పించుకొని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ సిఫారసు చేస్తున్న పనులు చక్కబెడుతున్నారు. ఈ విషయాన్ని అధికార పార్టీకే చెందిన కొందరు తాజా మాజీ కౌన్సిలర్లు చెబుతున్నారు. ఫైళ్ల ఆమోదం, పత్రాల ధ్రువీకరణతో పాటు డిజిటల్‌ లావాదేవీలన్నింటికీ ‘డిజిటల్‌ కీ’ చాలా అవసరం. మున్సిపల్‌ పరిధిలోని ఆస్తి పన్నులు, వర్తక లైసెన్సులు, బిల్డింగ్‌ ప్లాన్ల ఆమోదం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి అది తప్పనిసరి. అలాగే మున్సిపల్‌ ఆన్‌లైన్‌ లావీదేవీలకు, ఫైల్‌ ఎక్కడ పెండింగ్‌లో ఉందో తెలుసుకునేందుకు కూడా మున్సిపల్‌ కమిషనర్‌కు డిజిటల్‌ కీ ఎంతో అవసరం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న డిజిటల్‌ కీని గత కమిషనర్‌ అప్పగించకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై సందీప్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. డిజిటల్‌ కీ ఎక్కడుందో కనుక్కుంటా అని బదులీచ్చారు.

ఇప్పటికీ ఏఈ సీట్లోనే

మున్సిపల్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన ఏఈ కిరణ్‌కుమార్‌ ఇప్పటికీ ఏఈ సీట్లోనే కూర్చుంటున్నారు. కమిషనర్‌ చాంబర్‌లోకి వెళ్లేందుకు కూడా ఆయన భయపడుతున్నారు. ఆయనను అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు బెదిరించనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కమిషనర్‌ కుర్చీలో కూర్చోకుండా ఏఈ సీటుకే పరిమితమయ్యారని సిబ్బంది చెబుతున్నారు. రెండేళ్లుగా కదిరిలో డెప్యుటేషన్‌పై మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌ను ఇటీవల మాతృశాఖ (హార్టికల్చర్‌)కు బదిలీ చేసి, ఆయన స్థానంలో ఏఈ సందీప్‌ను నియమించిన విషయం తెలిసిందే.

నేను ఎక్కడికీ పోను..ఇక్కడే ఉంటా..

‘నాకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన ఆశీర్వాదాలు ఉన్నంతవరకూ నేనే ఇక్కడ కమిషనర్‌. త్వరలోనే మళ్లీ నన్నే కొనసాగించాలంటూ ఉత్తర్వులు వస్తాయి. సీఎం స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే నా విషయంలో చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. నా కింద పని చేసే ఏఈ సందీప్‌ నా సీట్లో ఎలా కూర్చుంటారు ’ అని మాతృశాఖకు బదిలీ అయిన కిరణ్‌కుమార్‌ అంటున్నారని కొందరు మున్సిపల్‌ ఉద్యోగులతో పాటు టీడీపీ తాజా మాజీ కౌన్సిలర్లు సైతం చెబుతున్నారు.

పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించని గత కదిరి కమిషనర్‌ కిరణ్‌

ఏఈ సీట్లోనే కూర్చుంటున్న

ప్రస్తుత కమిషనర్‌ సందీప్‌

Advertisement
 
Advertisement
Advertisement