చిలమత్తూరు: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహజ వనరుల దోపిడీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇసుక, మట్టి, గ్రావెల్ ఇలా ప్రతిదీ దోపిడీకి గురవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో సైతం అక్రమార్కులు క్రషర్లు పెట్టి మైనింగ్ చేస్తున్నారు. తాజాగా మండల పరిధిలోని మొరసపల్లి పంచాయతీ మాదిరెడ్డిపల్లి శివార్లలో సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన కొండపై మైనింగ్ మాఫియా కన్నుపడింది. ఇక్కడ వెలసిన దేవదేవుడిని మాదిరెడ్డిపల్లితో పాటు సోమఘట్ట పంచాయతీ పరిధిలోని ఎస్. కొత్తపల్లి ప్రజలు చాలా ఏళ్లుగా కొలుస్తున్నారు. కొండపై పూర్వం కట్టించిన మంటపాలు సైతం ఉన్నాయి.
ఇష్టారాజ్యంగా అనుమతులు..
అధికార టీడీపీ నేతలు మాదిరెడ్డిపల్లి కొండలో క్రషర్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. భక్తుల మనోభావాల్ని పక్కన పెట్టి మరీ మైనింగ్ శాఖ వారు ఎక్కడ పడితే అక్కడ కొల్లగొట్టేందుకు అనుమతులు ఇచ్చేస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మాదిరెడ్డిపల్లి గ్రామస్తులు మాత్రం కొండలో మైనింగ్‌కు ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెబుతున్నారు. ఇష్టదైవం కోసం ఎందాకై నా పోరాటాలు చేస్తామని, అధికారులు తమ మనోభావాల్ని పట్టించుకోకుండా ఎలా ముందుకెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తులకు బెదిరింపు...
కొండపై సర్వే నిమిత్తం వచ్చిన అధికారులు, ప్రైవేటు వ్యక్తులను ఇటీవల మాదిరెడ్డిపల్లి గ్రామస్తులు ప్రశ్నించారు. దైవం ఉన్న చోటును తుడిపేస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించగా.. సదరు వ్యక్తులు తిరగబడినట్లు తెలిసింది. ఎవరు అడ్డువచ్చినా మైనింగ్ చేసి తీరుతామంటూ బెదిరించినట్టు స్థానికులు చెబుతున్నారు.
గతంలో గుప్తనిధుల కోసం వేట..
మాదిరెడ్డిపల్లి కొండలో అపారమైన నిధి నిక్షేపాలు ఉన్నట్టు భక్తుల విశ్వాసం. అక్కడ పెద్ద గుహ ఉందని, అపార సంపదను అందులో దాచారన్న ప్రచారం ఉంది. అందుకు బలం చేకూర్చేలా గతేడాది కొందరు వ్యక్తులు గుహలో పేలుళ్లు జరిపారు. గ్రామస్తులు రావడంతో ఉడాయించారు. ఈ క్రమంలో మైనింగ్ మాటున కొండను స్వాధీనం చేసుకుని సంపదను దోచుకోవడానికే ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కళావిహీనంగా రాజుదేవరకొండ ..
చిలమత్తూరు మండల పరిధిలోని గాడ్రాళ్లపల్లి సమీపంలోని రాజుదేవరకొండ ఇప్పటికే మైనింగ్ మాఫియా చేతిలో చిక్కి కళా విహీనంగా తయారైంది. అనుమతి పొందిన సర్వే నంబరులో కాకుండా వేరే సర్వే నంబరులో ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని, గుప్తనిధుల వేటలో భాగంగానే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజుదేవరకొండపై శివాలయం ఉండగా, ఆలయాన్ని గతంలోనే గుప్తనిధుల వేటగాళ్లు ధ్వంసం చేయడం గమనార్హం.
మైనింగ్ శాఖ ఉన్నట్టా.. లేనట్టా..?
అక్రమార్కులు ఏం చేసుకున్నా తాము స్పందించబోమంటూ మైనింగ్ శాఖ అధికారులు చోద్యం చూస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. ఆ శాఖ అధికారులు కనీసం అందుబాటులో కూడా ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు జిల్లాలో మైనింగ్ శాఖ ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో జోగుతూ సహజ వనరులు దోపిడీకి గురవుతున్నా పట్టించుకోవడం లేదని జిల్లావాసులు మండిపడుతున్నారు.
మాదిరెడ్డిపల్లి కొండపై
మైనింగ్ మాఫియా కన్ను
భక్తుల మనోభావాల్ని
పట్టించుకోని మైనింగ్ శాఖ
అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు


