ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్
ప్రశాంతి నిలయం: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్ మంజూరు చేస్తున్నట్లు కల్టెర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఆయన ‘పీఎం సూర్యఘర్’పై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీల వర్గాల వారికి 23.97 ఎండబ్ల్యూపీ సామర్థ్యంతో ఉచిత రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే 11,987 మంది అర్హులను గుర్తించామన్నారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందన్నారు. హిందూపురం, కదిరి, పుట్టపర్తి డివిజన్లలో సర్వే పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, వెండర్లు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రీ సర్వే పురోగతి, మ్యుటేషన్లు, పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ, సుమోటో దరఖాస్తుల పరిష్కారం, 22–ఏ కేసులు, రెవెన్యూ క్లినిక్, పీజీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో అందిన అర్జీల పురోగతిపై సమీక్షించారు. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో పురోగతి ఉండాలన్నారు. అలాగే జ్యుడీషియల్ కార్యాలయాలకు కేటాయించిన భూముల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య
ప్రశాంతి నిలయం: ఓపెన్ ఇంటర్, టెన్త్‌తో పాటు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీహాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓపెన్ ఇంటర్ పరీక్షలు మార్చి 2 నుంచి 13వ తేదీ వరకూ జరగనున్నాయన్నారు. జిల్లా నుంచి 1,244 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా...ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక పదో తరగతి, పది ఓపెన్ పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకూ జరుగుతాయన్నారు. పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులు 22,303 మంది పరీక్షలకు హాజరు కానుండగా... 107 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు 446 మంది విద్యార్థులు రాయనుండగా.. వారి కోసం ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులన్నీ కల్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ కిష్టప్ప, ఇంటర్ విద్య జిల్లా అధికారి చెన్నకేశవప్రసాద్, పరీక్షల కోఆర్డినేటర్ లాజరు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వసంతోత్సవం
అమరాపురం: సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన వసంతోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, పంచెకట్టుతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. రంగులు, సుగంధ ద్రవ్యాలు సమర్పించి మహా మంగళహారతి ఇచ్చారు. అంతకుముందు రథోత్సవంలో భాగంగా శుక్రవారం స్థానిక బస్టాండు వరకూ లాగిన రథానికి అర్చకులు పూజలు నిర్వహించి.. తిరిగి ఆలయం వరకూ తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తులు సిద్ధేశ్వరస్వామి జై అంటూ ఆ మహాదేవున్ని కీర్తిస్తూ రథం లాగారు.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్


