సృజనకు పదును పెడదాం
●‘అనంత బాలోత్సవం–6’లో వక్తల పిలుపు
అనంతపురం కల్చరల్: చిన్నారులను సెల్‌ఫోన్‌కు బానిసలు కాకుండా వారిలో సృజనకు పదునుపెట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. పిల్లలను చదువుతో పాటు కళల్లోనూ ప్రోత్సహించాలని సూచించారు. విలువైన సమయం వృథా చేసుకోకుండా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు, తల్లిదండరుల కోరారు. ‘అనంత బాలోత్సవం – పిల్లల పండుగ–6’ శనివారం అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో ప్రారంభమైంది. రెండురోజులపాటు సాగే పండుగకు నాట్యాచార్యులు సంధ్యామూర్తి, పట్నం శివప్రసాద్ శిష్యబృందాల స్వాగత శాసీ్త్రయ నృత్యాలతో శ్రీకారం చుట్టారు. తొలిరోజు శాసీ్త్రయ, జానపద నృత్యాలు, ఫోక్, లలిత సంగీతం, వివిధ రకాల వేషధారణలు, సందేశాత్మక నాటికలతో చిన్నారులు అలరించారు. వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, బొమ్మల తయారీలో సృజనను కనబరిచారు. పత్రికా పఠనంతో పాటు సైన్సు ప్రయోగాలతో చిన్నారులు అబ్బురపరిచారు. ముఖ్యంగా ఇటీవల పార్లమెంటు వరకు వెళ్లి వచ్చిన చిన్నారి సుంకర నవని ‘అమ్మ పేరు మీద ఓ చెట్టు నాటుదాం .. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అంటూ ప్రత్యేక స్టాల్ నిర్వహించి అధికారుల ప్రశంసలందుకుంది. బాలోత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, కత్తి విజయ్‌కుమార్, పట్నం శివప్రసాద్, జూటూరు షరీఫ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. తొలిరోజు విజేతలుగా నిలిచిన చిన్నారులకు సర్టిపికెట్లు, జ్ఞాపికలనందించారు.
మధుర జ్ఞాపకంగా మార్చుకోండి..
అందమైన బాల్యాన్ని ఒత్తిడి నింపే చదువుతోనూ, హాని కల్గించే సాంకేతిక పరిజ్ఞానంతో కాకుండా మనో విజ్ఞానాన్ని కల్గించే కళలు, ఆటపాటలతో మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని వక్తలు సూచించారు. బాలోత్సవ కమిటీ చైర్‌పర్సన్ షమీమ్ షఫీవుల్లా, ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఈఓ ప్రసాదబాబు, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఐద్వా నాయకురాలు సావిత్రి తదితరులు పిల్లలనుద్దేశించి ప్రసంగించారు.


