కొబ్బరి సాగుపై రైతుల ఆసక్తి
పుట్టపర్తి అర్బన్: ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని తెచ్చి పెట్టే పంటల్లో కొబ్బరి ముందంజలో ఉంది. సీజన్ ఏదైనా సరే కొబ్బరి బోండానికి డిమాండ్ తగ్గడం లేదు. కులమతాలకు అతీతంగా సాగే పూజలు, శుభకార్యాలు అంటే టెంకాయ తప్పనిసరి. ఈ నేపథ్యంలో వినియోగం పెరిగే కొద్దీ జిల్లాలో కొబ్బరి తోటల విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది.
రైతులకు కాసుల పంట..
రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్న కొబ్బరి సాగుపై ఇటీవల జిల్లాలో విస్తరిస్తోంది. గతంలో రొద్దం, అగళి, రొళ్ల, గుడిబండ, లేపాక్షి, పెనుకొండ మండలాల్లో సుమారు 620 ఎకరాల్లో మాత్రమే కొబ్బరి తోటలు ఉండేవి. ప్రస్తుతం 32 మండలాల్లోనూ 1,150 ఎకరాల్లో కొబ్బరి తోటలు విస్తరించాయి. మామిడి, చీనీ, జామ తోటలను కాదని కొందరు రైతులు దీర్ఘకాలిక పంటగా కొబ్బరి సాగు చేపడుతున్నారు. రైతులతో పాటు కొబ్బరి బోండాలు, టెంకాయల విక్రయదారులు, ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె, కొబ్బరి పీచుతో తాళ్లు, ఖాళీ చిప్పలతో గృహోపకరణాలు చేస్తూ పలువురు ఉపాధి పొందుతున్నారు.
శ్రమ తక్కువ..
కొబ్బరి చెట్లలో పొడవు, పొట్టి రకాలు ఉన్నాయి. జిల్లాలోని హిందూపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి ప్రాంతాల్లో ఉన్న నర్సరీల్లో టెంకాయ మొక్కలు అందుబాటులో ఉంటున్నాయి. రొద్దంలో అతి పెద్ద నర్సరీ ఉంది. కాయ నాణ్యతను బట్టి రూ.250 నుంచి రూ.500 వరకూ ధరలు పలుకుతున్నాయి. ఉద్యానశాఖ అధికారుల సూచనలను అనుసరించి ఎకరాకు 60 నుంచి 70 మొక్కల వరకు నాటుతున్నారు. శ్రమ తక్కువ. మొక్క నాటిన మూడేళ్లకు తొలి కాపు అరకొరగా వస్తుంది. ఐదేళ్లు పూర్తయ్యే సరికి పంట దిగుబడి పెరుగుతుంది. ఏడాదికి రెండు సార్లు దిగుబడి వస్తుంది. ఏడాదికి ఒక మొక్క అత్యధికంగా 200 నుంచి 400 కాయల వరకూ దిగుబడినిస్తుంది. ప్రస్తుతం బోండాలకు, టెంకాయలకు భారీ గిరాకి ఉంది. టెంకాయ ఒక్కొక్కటి రూ.40 నుంచి రూ.50 వరకూ విక్రయిస్తుండగా బోండాలు ఒక్కొక్కటి రూ.30 నుంచి రూ. 40 వరకూ అమ్ముడుపోతున్నాయి. కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా వక్క, మహాగని, శ్రీగంధం చెట్లతో పాటు 3 ఏళ్ల వరకూ వేరుశనగ సాగు చేసుకోవచ్చునని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. మహాగని, శ్రీగంధం చెట్లు 15 ఏళ్లకు తొలగించుకోవచ్చు. పొట్టి రకం కొబ్బరి తోటలు 35 ఏళ్ల వరకు, పొడవు రకం కొబ్బరి తోటల్లో వందేళ్ల వరకు దిగుబడులు ఉంటాయని పేర్కొంటున్నారు.
జిల్లాలో పెరుగుతున్న
కొబ్బరి తోటల విస్తీర్ణం
32 మండలాల్లో 1,150 ఎకరాల్లో
విస్తరించిన తోటలు
కొబ్బరి సాగుపై రైతుల ఆసక్తి


