బేకరీ దగ్ధం
ధర్మవరం అర్బన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న బేకరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు రాజుకున్నాయి. బస్టాండ్ సమీపంలో నైట్ బీట్‌లో ఉన్న పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ మాధవనాయుడు తన సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. జేసీబీ సాయంతో షెట్టర్లను పెకలించారు. అప్పటికే ఫ్రిడ్జ్, పలు యంత్రాలు, పరికరాలు, ఫర్నీచర్, తినుబండారాలు కాలి బూడిదయ్యాయి. ఘటనతో రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బేకరీ యజమాని అజయ్ వాపోయాడు.
మామిడి మొక్కల దగ్ధం
చెన్నేకొత్తపల్లి: మండలంలోని వెంకటాంపల్లిలో రైతు వెంకటరెడ్డి సాగు చేసిన మామిడి మొక్కలు, డ్రిప్పు పరికరాలు శుక్రవారం అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. శుక్రవారం మధా్‌య్‌హ్నం పొలంలో మొక్కలకు నీరు పెట్టేందుకు మోటార్‌ను ఆన్ చేయగా షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసి చెత్తాచెదారంపై పడి మంటలు రాజుకున్నాయి. రైతు కుటుంబ సభ్యులు గమనించి మంటలు ఆర్పే లోపు తోటను చుట్టుముట్టాయి. ఏడాది వయసున్న 80 మామిడి మొక్కలు, డ్రిప్పు పైపులు, బోరులో ఉన్న మోటారు, స్టార్టర్ పూర్తిగా కాలిపోయాయి. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.
కాలిబూడిదైన పశుగ్రాసం
వెంకటాంపల్లి సమీపంలో వ్యవసాయ పొలం వద్ద నివాసమున్న రైతు గోవిందరెడ్డికు చెందిన 3 ట్రాక్టర్ల వరి గడ్డి మంటల్లో కాలి బూడిదైంది. కరెంటు వైర్ల కింద గడ్డి వామి ఉండడంతో గాలికి వైర్లు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు వ్యాపించినట్లు బాధిత రైతు తెలిపాడు.
యూపీ వాసి ఆత్మహత్య
ముదిగుబ్బ: మండలంలోని చిన్నేకుంటపల్లి సమీపంలో రైలు కిందపడి యూపీకి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉత్తరప్రదేశ్‌లోని బహుతికాల గ్రామానికి చెందిన శివం (26)కు భార్య సాధన, ఇద్దరు కుమారులు ఉన్నారు. బతుకు తెరువు కోసం కుటుంబంతో పాటు వలస వచ్చిన శివం.. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామంలో ఓ రైతు తోటలో ఉంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో కుటుంబంలో తరచూ దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకునేవి. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న శివం... శుక్రవారం ముదిగుబ్బ మండలం చిన్నేకుంటపల్లి వద్ద ఉన్న పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి బలవన్మరణం
మడకశిర: స్థానిక తలారి వీధిలో నివాసముంటున్న బాలాజీ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. తరచూ కడుపునొప్పితో బాధపడుతున్న అతను... గురువారం నొప్పి తీవ్రత తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు విషయాన్ని గుర్తించి వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక బాలాజీ మృతి చెందాడు. ఘటనపై ఎస్‌ఐ లావణ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వేధింపులు తాళలేక వివాహిత..
పరిగి: మండలంలోని పుట్టగూర్లపల్లికి చెందిన వివాహిత జ్యోతి(26) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని తాడి గ్రామానికి చెందిన నాగార్జునతో ఆరేళ్ల క్రితం జ్యోతికి వివాహమైంది. కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుని తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఈ నెల 14న పుట్టింటికి వచ్ని జ్యోతి.. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రంగడు యాదవ్ తెలిపారు.
దొంగల అరెస్ట్
పెనుకొండ: నియోజకవర్గంలోని పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ నర్శింగప్ప వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురానికి చెందిన కోటయ్య, శాలి ఉన్నారు. వీరి నుంచి రూ. 30లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
బేకరీ దగ్ధం


