విద్యార్థి మృతదేహం లభ్యం
కనగానపల్లి: మండలంలోని బద్ధలాపురం గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన విద్యార్థి సాహెల్ (17) మృతదేహమై తేలాడు. అనంతపురంలో నివాసముంటున్న బాషా, షకీలా దంపతుల కుమారుడు సాహెల్.. అక్కడి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో గత మంగళవారం తన స్నేహితులతో కలసి రామగిరి మండలంలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లాడు. అనంతరం ఆటోలో తిరుగు ప్రయాణమైన వారు మధ్యాహ్నం బద్ధలాపురం సమీపంలోకి చేరుకోగానే హంద్రీ–నీవా కాలువలో ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు ఆగారు. ఆ సమయంలో నీటిలోకి దిగిన సాహెల్ ప్రమాదవశాత్తు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతూ వచ్చాయి. ఈ క్రమంలో గురువారం రామగిరి మండలం చెర్లోపల్లి వద్ద నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు.
యువకుడి దుర్మరణం
లేపాక్షి: మండలంలోని కొండూరు సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం ముళ్లమోతుకపల్లికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి (32) లేపాక్షి మండలం కొండూరులోని తన మేనత్తను చూసేందుకు గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కొండూరు సమీపంలోకి చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా వచ్చిన జింకను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బైక్ అదుపు తప్పి యువకుడు..
ధర్మవరం రూరల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని దుర్గా నగర్‌కు చెందిన పెద్దిరాజు కుమారుడు సాయికిరణ్ (23) డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. తన స్నేహితుడు నందతో కలసి గురువారం ద్విచక్ర వాహనంపై కుణుతూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో మలుపు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక వాహనం అదుపు తప్పి కిందపడ్డారు. ఘటనలో సాయికిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నందను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైలు కింద పడి వృద్ధుడి మృతి
పెనుకొండ: పట్టణ సమీపంలోని షీఫారం వద్ద రైలు కింద పడి తిప్పన్న (65) చనిపోయినట్లు రైల్వే పోలీసులు శుక్రవారం తెలిపారు. రొద్దంకు చెందిన తిప్పన్న గురువారం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి వచ్చాడన్నారు. మానసిక వ్యధతో రైలు కింద పడి చనిపోయినట్లు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
విద్యార్థి మృతదేహం లభ్యం


