గ్యాస్ లీకై .. మంటలు చెలరేగి
ఉరవకొండ రూరల్: స్థానిక డ్రైవర్స్ కాలనీలోని ఓ షెడ్డులో వంట గ్యాస్ లీకై భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ.25 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన మేరకు... డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్న దాదాఖలందర్ కురుకురె తదితర చిరుతిళ్ల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో స్టాక్ నిల్వ చేసేందుకు ఇంటి సమీపంలోనే ఓ రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం ఉదయం సరుకులను తరలించేందుకు సిద్ధమైన ఆయన ఒమినీ వాహనాన్ని షెడ్డులో ఉంచి వంట గ్యాస్ సిలిండర్ నుంచి వాహనంలోని సిలిండర్‌లోకి గ్యాస్ బదలాయిస్తుండగా లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షెడ్డులో ఉంచిన బుల్లెట్ వాహనాన్ని మంటలు చుట్టుముట్టడంతో వేడికి పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. రూ.25 లక్షలకు పైగా విలువైన తినుబండారాల ప్యాకెట్లు, ఒమినీ, బుల్లెట్ వాహనాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.


