
తొలి ఫలితం పుట్టపర్తిదే!
అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు మరో 10 రోజుల్లో జరగనుంది. దీంతో జిల్లా యంత్రాంగం కౌంటింగ్‌కు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఓట్ల లెక్కింపునకు సిబ్బందిని నియమించడంతో పాటు శిక్షణ సైతం ఇస్తోంది. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టింది.
కౌంటింగ్ కేంద్రాల్లో
ఏర్పాట్ల పరిశీలన
హిందూపురం: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలను పక్కాగా పాటిస్తూ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.అరుణబాబు ఆదేశించారు. శుక్రవారం ఆయన ‘బిట్’ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో నియోజకవర్గాల వారీగా జరిగే ఓట్ల లెక్కింపు కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. సీసీ కెమెరాల పనితీరు, మానిటరింగ్ రూమ్ ద్వారా పర్యవేక్షణ తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాగ్ బుక్‌లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్‌ఓలు వంశీకృష్ణ, గౌరీ శంకర్ తదితరులు ఉన్నారు.
పుట్టపర్తి అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో చివరి ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కౌంటింగ్ జరిగే లేపాక్షి సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, హిందూపురం సమీపంలోని ‘బిట్’ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. స్ట్రాంగ్ రూంలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి, అన్ని నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు తరచూ వెళ్లి పరిశీలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కో నియోజకవర్గం ఒక్కో ఫ్లోర్‌లోని గదుల్లో ఈవీఎంలను భద్ర పరిచారు. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
తీర్పు చెప్పిన 14 లక్షల మంది..
జిల్లాలో 16,56,775 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 14,03,259 మంది ఓటు వేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అతి తక్కువగా 1,82,090 మంది, ధర్మవరం నియోజకవర్గంలో అత్యధికంగా 2,18,292 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా జిల్లాలోని 14 లక్షల మంది తీర్పు ఎటువైపు ఉందన్నది జూన్ 4వ తేదీన తేలనుంది.
పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభం..
జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ల కోసం మడకశిర నియోజకవర్గానికి 2 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. కదిరికి అత్యధికంగా 4 టేబుళ్లు, తక్కిన అన్ని నియోజకవర్గాలకు మూడేసి టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు సర్వీస్ ఓటర్ల కోసం అదనంగా నియోజకవర్గానికి ఒక టేబుల్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈవీఎంల ఓట్ల లెక్కింపు 8.30 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. అలాగే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికీ 14 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. సర్వీస్ ఓటర్ల ఓట్లు కోసం 5 టేబుళ్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్, ఒక అసిస్టెంట్, ఒక అటెండర్ కలిపి నలుగురు ఉంటారు. ఇక రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు ఇద్దరేసి ఉంటారు. వారి కోసం ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేస్తారు.
చివర్లో ధర్మవరం ఫలితం..
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా తక్కువ రౌండ్లు, తక్కువ పోలింగ్ కేంద్రాలున్న పుట్టపర్తి, మడకశిర నియోజకవర్గాల ఫలితం తొలుత తేలనుంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 18 రౌండ్‌లతో ముగుస్తుంది. దీంతో ఫలితం త్వరగా తేలుతుంది. ఇక అత్యధికంగా ఓటర్లున్న ధర్మవరం నియోజకవర్గానికి 21 రౌండ్లు ఉంటాయి. దీని ఫలితం కాస్త ఆలస్యంగా వస్తుంది. ఒక్కో రౌండు 20 నిమిషాల నుంచి అరగంట పట్టవచ్చు. ఇందులో ఒక రౌండుకు 14 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు.
సిబ్బందికి శిక్షణ..
కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి కలెక్టర్ అరుణ్‌బాబు సమక్షంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. జూన్ 1వ తేదీన మరోసారి శిక్షణ ఉంటుంది. ఇక నియోజకవర్గాల్లో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ ఈనెల 26, జూన్ 2వ తేదీన నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 119 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించారు.
కట్టుదిట్టమైన చర్యలు..
కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్‌లు ఎగురవేయడాన్ని నిషేధించారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు, అభ్యర్థులు బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదు. ఇప్పటికే పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ పేరుతో అనుమానితుల ఇళ్లను శోధిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బాటిళ్లలో పెట్రోలు, డీజిల్ పోయడాన్ని నిషేధించారు. స్ట్రాంగ్ రూంలతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు ముమ్మరం
ప్రతి రౌండుకూ 14 టేబుళ్ల చొప్పున
ఓట్ల లెక్కింపు
కౌంటింగ్ కేంద్రాల వద్ద
మూడంచెల భద్రత

తొలి ఫలితం పుట్టపర్తిదే!

తొలి ఫలితం పుట్టపర్తిదే!