
సిబ్బందితో మాట్లాడుతున్న ప్రజారవాణాధికారి మధుసూదన్
పుట్టపర్తి టౌన్: సత్యసాయిబాబా 98వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఈనెల 22, 23, 24 తేదీల్లో పుట్టపర్తి నుంచి అనేక ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ప్రజా రవాణాధికారి మధుసూదన్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో డిపో మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్ ఇన్‌చార్జులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. మహానగరాలైన హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విజయవాడతో పాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చే వారి కోసం ఈనెల 22, 23 తేదీల్లో 70 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఇంకా సర్వీసులు పెంచుతామన్నారు. పుట్టపర్తి రైల్వేష్టేన్ – పుట్టపర్తి మధ్య 10, కొత్తచెరువు – పుట్టపర్తి – బుక్కపట్నం మధ్య 10, ధర్మవరం రైల్వేస్టేషన్ – పుట్టపర్తి మధ్య 10, కదిరి– పుట్టపర్తి మధ్య 10, హిందూపురం – పుట్టపర్తి మధ్య 10 , పెనుకొండ – పుట్టపర్తి మధ్య 5, అనంతపురం – పుట్టపర్తి మధ్య 10, చైన్నె– పుట్టపర్తి మధ్య 2, హైదరాబాద్– పుట్టపర్తి మధ్య 2, బెంగుళూరు– పుట్టపర్తి మధ్య 2 సర్వీసులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. సత్యసాయి భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇనయతుల్లా, ట్రాఫిక్ ఇన్‌చార్జ్ పెద్దన్న, పార్థసారధిరెడ్డి, షాషావలి, తదితరులు పాల్గొన్నారు.