● సీమతో పాటు నెల్లూరుకు తీరని నష్టం
● గ్రేటర్ రాయలసీమ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి
నెల్లూరు(అర్బన్)/నెల్లూరురూరల్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయితే గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు కొరత లేకుండా అందేది. అలాంటి లిఫ్ట్ ఇరిగేషన్(ఎత్తిపోతల పథకం) ప్రాజెక్ట్‌కు చంద్రబాబు ప్రభుత్వం గ్రహణం పట్టించిందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని డీఆర్ ఉత్తమ హోటల్ సమావేశం మందిరంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్‌ఫోర్స్ రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం జరిగింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి గ్రేటర్ రాయలసీమ జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలు, టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, చైన్నె ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణానదిలో 101 టీఎంసీల నికర జలాలను కేటాయించడం జరిగిందన్నారు. అందులో సోమశిల ప్రాజెక్ట్‌కు శ్రీశైలం నుంచి వచ్చే కృష్ణా జలాలు జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చుతున్నాయన్నారు. నికర జలాలను వాడుకునే పరిస్థితి లేనందున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సీమఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ పథకం పూర్తయితే నెల్లూరుకు ఎంతో ఉపయోగమన్నారు. 80 శాతానికి పైగా పూర్తయిన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే పక్కన బెట్టేశాడన్నారు.
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో
చంద్రబాబు కుట్రలు బట్టబయలు
ఈ ఏడాది జనవరిలో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు తెలిసిందన్నారు. తనతో జరిగిన చర్చలో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్‌ను ఆపేస్తానని చెప్పారని రేవంత్ వెల్లడించారన్నారు. దాదాపు పూర్తయిన ప్రాజెక్ట్ పనులను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం చెప్పలేదన్నారు. ఒకసారి పర్యావరణ అనుమతుల పేరుతో, మరోసారి ప్రాజెక్ట్‌ను తాము ఆపలేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందన్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఆధారాలను కూడా తాము ప్రజల ముందుంచామని, ప్రస్తుతం నీటి లభ్యతపై తీవ్రఅనిశ్చితి నెలకొన్న సమయంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వల్ల కేవలం రాయలసీమ మాత్రమే కాదు, కృష్ణా జలాలపై ఆధారపడిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభావితమవుతుందన్నారు. అయినా ఆల్మట్టి ఎత్తు పెంపుపై చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని, గతంలోనూ ఇదే వైఖరి ప్రదర్శించారన్నారు. ఇప్పుడు కూడా కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కమాట మాట్లాడకుండా ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం, ఆల్మట్టి ఎత్తు పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, పోలవరం అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పేలా చేయడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు, పౌరసంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందన్నారు. పూర్తి కావాల్సిన రాయలసీమ లిఫ్ట్‌ను వదిలేసి బనకచర్ల పేరుతో కొత్త భ్రమలు సృష్టించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టే రాయలసీమ భవిష్యత్‌ను మార్చే గేమ్ ఛేంజర్ అని, అది లేకపోతే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు కేటాయించిన నికర జలాలను కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందుకే రైతులు, మేధావులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ముందుకొచ్చి పోరా టంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
● రాయలసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ మంత్రి సాకే శైలజానాఽథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నిర్బంధ పాలన సాగుతుందన్నారు. సీమకు ప్రాణపదమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఆపేశాడన్నారు. అందువల్ల జరిగే నష్టంపై ప్రజల్లో చర్చపెట్టి చైతన్యవంతం చేస్తున్నామన్నారు. ఉద్యమ కార్యాచరణ కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
● కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశానికి హాజరైన నియోజకవర్గాల ఇన్‌చార్జులు, సమన్వయకర్తలు, టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు సీమ ఎత్తిపోతల పథకంపై చర్చించి పనులను వేగవంతం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఉద్యమంపై ప్రజలు ఎంతో స్పందించారని తెలిపారు. సీమ ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెడితే జరిగే నష్టాలపై ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వం మెడలు వంచి సీమ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేలా ఉద్యమ కార్యచరణ చేపట్టనున్నామన్నారు. ఈ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాఽథ్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, పీసీ నాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పుత్తా శివశంకర్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, రంగయ్య, నెల్లూరు జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణ మ్మ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్, మేకపాటి విక్రమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, జిల్లా నాయకులు కొడవ లూరు ధనుంజయరెడ్డి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, వీరి చలపతిరావు, పేర్నేటి కోటేశ్వరరెడ్డి, వెంకటశేషయ్య, ఇంద్రసేనగౌడ్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజామద్దతుకు ప్రత్యేక కార్యాచరణ
రాయలసీమ ఎత్తిపోతల పథకం సహాప్రధాన సాగునీటి ప్రాజెక్ట్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికలు రూపొందించి ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. కమిటీ సభ్యులకు సాగునీటి ప్రాజెక్ట్‌ల సాంకేతిక, చారిత్రక, న్యాయపరమైన అంశాలపై ప్రత్యేక ఓరియంటేషన్, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ సభ్యులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ అసెంబ్లీ కమిటీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. పదవీ విరమణ పొందిన ఇంజినీర్లు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, నీటి వనరుల నిపుణులతో ప్రత్యేక సలహా కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమానికి సాంకేతిక, విధానపరమైన సహకారం అందించనున్నారు. ఆగస్టు నెలలో ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించి రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.


