● వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
నెల్లూరురూరల్: వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై అక్రమంగా కేసులు నమోదు చేయడం దారుణమని, ఇది రాజకీయ కక్ష సాధింపేనని ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంగమూరు ఆశ్రిత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు ఉండవల్లి గ్రామానికి వెళ్లిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులు, చైతన్యపై ముందస్తు ప్రణాళికతో దాడులు జరిగాయని ఆరోపించారు. నాయకులపై తప్పుడు ప్రచారం చేసి, చైతన్యను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేశారన్నారు. విద్యార్థి సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, డీఎస్సీ అవకతవకలు, వెల్ఫేర్ హాస్టళ్ల సమస్యలపై పోరాడినందుకే చైతన్యను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఆయన వెనక్కి తగ్గరని, పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విభాగం రాష్ట్ర కార్యదర్శి నేలటూరి మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తిరగకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. సిటీ అధ్యక్షుడు ఎండీ తౌఫిక్ మాట్లాడుతూ రాజధాని రైతులు మోసపోయామని గ్రహించి వైఎస్సార్‌సీపీని ఆశ్రయిస్తున్నారన్నారు. రైతుల పక్షాన నిలబడుతున్న చైతన్యపై రౌడీషీటర్ ముద్ర వేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు. సమావేశంలో విద్యార్థి విభాగం నాయకులు అజయ్, శ్రీకృష్ణ, సతీష్‌బాబు, అహ్మద్, షోయబ్ తదితరులు పాల్గొన్నారు.


