సంగం: వారంతా నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు సంతోషంగా బయలుదేరారు. అయితే అనుకోని ప్రమాదం విషాదం నింపింది. మండలంలోని తరుణవాయి సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతం నుంచి రొట్టెల పండగకు 20 మంది ట్రక్కు ఆటోలో బయలుదేరారు. ఇది తరు ణవాయి వద్దకు వచ్చింది. నెల్లూరు నుంచి వెళ్తున్న ఓ వాహనాన్ని బొగ్గు లారీ ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న దేవగుడి కరిష్మా (16) అనే పదో తరగతి విద్యార్థిని అక్కడికక్కడే చనిపోయింది. రమీజా అనే యువతికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. లారీని డీసీపల్లి టోల్‌ప్లాజా వద్ద గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కరిష్మా నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నర్సాపురంచాగలమర్రి ప్రాంతానికి చెందిన దేవగుడి మస్తాన్, సైదా దంపతుల కుమార్తెగా గుర్తించారు.
ట్రక్కు ఆటోను ఢీకొట్టిన బొగ్గు లారీ
బాలిక మృతి, యువతికి తీవ్ర గాయాలు
రొట్టెల పండగకు వెళ్తుండగా జరిగిన ఘటన


