నెల్లూరు(వేదాయపాళెం): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనప్పటికీ రైతులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అధిక దిగుబడులు సాధించాలని ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్‌ఎఫ్) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్ సూచించారు. నెల్లూరులోని ప్రకృతి వ్యవసాయం డీపీఎం కార్యాలయంలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లతో మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీడ్ పెల్లైటెజేషన్, ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ విధానాలను ప్రతి గ్రామంలో అమలు చేయాలని సూచించారు. సీడ్ పెల్లైటెజేషన్ విధానం ద్వారా విత్తనాల మొలక శాతం పెరగడంతో పాటు తక్కువ తేమలోనూ మొక్కలు బలంగా పెరుగుతాయని తెలిపారు. ఈ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.కన్నయ్య, రీజినల్ టెక్నికల్ కో ఆర్డినేటర్ సీహెచ్ రవిచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.


