కలెక్టర్‌కు సమస్యలు ఏకరువు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు సమస్యలు ఏకరువు

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

అప్పసముద్రంలో కలెక్టర్‌ పల్లె వీక్షణ

ఫిర్యాదులు స్వీకరిస్తూ..

పరిష్కారాలకు ఆదేశాలు

గంటన్నరలో ముగిసిన పర్యటన

ఉదయగిరి: పల్లె వీక్షణలో భాగంగా అప్పసముద్రంలో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మంగళవారం పర్యటించారు. సుడిగాలి పర్యటన చేస్తూ గంటన్నర వ్యవధిలో పల్లెవీక్షణను పూర్తిచేశారు. తొలుత చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి వర్మికంపోస్టును రైతులకు అందించాలని సూచించారు. అనంతరం అక్కడే ఉన్న పశువుల తాగునీటి తొట్టెను పరిశీలించి మొక్కలు నాటారు. ఆ తరువాత ఎస్సీకాలనీలో పర్యటించారు. ఆరికొండ మాలకొండయ్య ట్రైసైకిల్‌ కోసం అర్జీ ఇవ్వగా మంజూరుకు ఆదేశాలు ఇచ్చారు. అప్పసముద్రం గ్రామ వీధుల్లో పర్యటించి విద్యార్థులు, గ్రామస్తులతో ముచ్చటించారు. స్థానిక సమస్యలు, అధికారుల పనితీరుపై ఆరాతీశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకును పరిశీలించి నీటిలో ఫ్లోరిన్‌ శాతాన్ని పరీక్షించారు. అనంతరం సచివాలయం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అప్పసముద్రం నుంచి నర్రవాడ జాతీయ రహదారిని కలిపే గ్రావెల్‌ రోడ్డును మంజూరు చేయాలని కోరగా అంగీకారం తెలిపారు. అప్పసముద్రానికి దుత్తలూరుకు బదులుగా ఉదయగిరి ఫీడర్‌ నుంచి సరఫరా ఇవ్వాలని, విద్యుత్‌ లైన్‌మెన్‌ల కొరతను వెంటనే పరిష్కారించాని ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ ఈ రాఘవేంద్రను అదేశించారు. స్థానిక ఎంపీపీ స్కూల్‌లో ఉపాధ్యాయులు లేరని తెలుసుకుని విద్యాశాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ బడులు తెరిచేలోగా నియమించాలని డీఈఓకు ఆదేశాలు ఇచ్చారు. దాసరిపల్లి గ్రామ సమస్యలను టీచర్‌ జాఫర్‌ మొయినుద్దీన్‌ కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఆక్రమణకు గురైన పాతూరు చెరువును పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కలెక్టర్‌ అదేశించారు. పదో తరగతి ఫలితాల్లో మండలస్థాయిలో ప్రతిభకనబర్చిన విద్యార్థులను కలెక్టర్‌ అభినందించి ప్రశంసాపత్రాలు జ్ఞాపికలు అందజేశారు. భూములు, నూతన పింఛన్లు, ఆరోగ్య సేవల కోసం పలువురు కలెక్టర్‌కు అర్జీలు ఇవ్వగా ఆర్డీఓకు అందజేసి పరిష్కారించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో అధికారులు, సిబ్బంది పనితీరులో లోపాలు స్పష్టంగా కనిపించినా కలెక్టర్‌ వారిని మందలించకపోవడం విశేషం. కాగా కలెక్టర్‌ షెడ్యూల్‌లో ఉపాధి పనుల పరిశీలన ఉన్నప్పటికి వెళ్లలేదు. సీఈఓ శ్రీధ ర్‌, డీపీఓ వసుమతి, వ్యవసాయశాఖ జేడీ సత్యవాణి, జిల్లా ఉద్యాన అధికారి సుబ్బారెడ్డి, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్‌, ఆర్డీఓ పావని, డిప్యూటీ కలెక్టర్లు సన్నీ వంశీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement