కేజీబీవీ టీచర్లు, ప్రిన్సిపల్స్‌కు బదిలీల కౌన్సెలింగ్‌ నేడు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ టీచర్లు, ప్రిన్సిపల్స్‌కు బదిలీల కౌన్సెలింగ్‌ నేడు

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

నెల్లూరు(టౌన్‌): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌, పీజీటీలు, సీఆర్టీలకు బుధవారం బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. కావలిలోని కేజీబీవీలో పనిచేస్తున్న ప్రిన్సిపల్‌ ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నారు. అదే విధంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరుగురు పీజీటీలు, సీఆర్టీలున్నారు. వీరికి తప్పనిసరిగా బదిలీలు జరుగనున్నాయి. అదే విధంగా మరో 11 మంది రిక్వెస్ట్‌ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సమగశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

ఇసుక వాహనాలు

నిబంధనలు పాటించాల్సిందే

ఇన్‌చార్జి డీడీ శ్రీనివాసరావు

నెల్లూరు(టౌన్‌): జిల్లాలో ఇసుక రవాణా చేస్తున్న వాహనదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా గనుల, భూగర్భ శాఖ ఇన్‌చార్జి డీడీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి వాహనాన్ని టార్పాలిన్‌తో పూర్తిగా కప్పాలన్నారు. ముందు భాగంలో ఉచిత ఇసుక వాహనం అంటూ బోర్డును అమర్చాలన్నారు. వినియోగదారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవడంతోపాటు తనిఖీల సమయంలో దానిని సంబంధిత అధికారులకు చూపించాలన్నారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లాంటి ప్రాంతాల వద్ద జాగ్రత్తగా వాహనాన్ని నడపాలన్నారు. ఇసుక రవాణా చేసే అన్ని వాహనాల్లో తప్పనిసరిగా జీపీఎస్‌ పరికరం అమర్చాలన్నారు. లేకపోతే డ్రైవర్‌ మొబైల్‌లో జీపీఎస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి రవాణా పూర్తయ్యే వరకు ఆన్‌లో ఉంచాలన్నారు. ఉచిత ఇసుకను అధిక మొత్తంలో నిల్వ చేయడం లేదా డంపింగ్‌ చేయడం, వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం పూర్తి నిషేధమన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విధులకు వచ్చి..

గుండెపోటుకు గురై..

ఆత్మకూరులో ఫార్మసిస్ట్‌ మృతి

ఆత్మకూరు: అతను ఉదయం ఇంటి నుంచి విధులకు వచ్చాడు. ఈ క్రమంలో గుండెపోటుకు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది వివరాల మేరకు.. కలువాయికి చెందిన వడిదారి పెంచలయ్య (43) కొంతకాలంగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఊరి నుంచి వచ్చి విధుల్లో ఉన్న సమయంలో గుండెనొప్పిని గ్యాస్‌ సమస్యగా భావించి మాత్రలు వేసుకునేందుకు ఉపక్రమిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే సిబ్బంది ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. డాక్టర్లు చికిత్స చేస్తుండగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. పెంచలయ్య మృతి వార్త తెలుసుకున్న ఏపీ హంస (ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌) జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు, కార్యదర్శి బి.కమల్‌ కిరణ్‌, పట్టణాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు వెంకట్రావు సంతాపం తెలిపారు. పెంచలయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

గుర్తుతెలియని

వాహనం ఢీకొని..

వ్యక్తి దుర్మరణం

బిట్రగుంట: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం ముంగమూరుకు చెందిన గొత్తల నాగరాజు (35) అల్లూరులోని కెనరా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ కావలిలో నివాసం ఉంటున్నాడు. బ్యాంక్‌ విధులు ముగించుకుని మోటార్‌బైక్‌పై కావలికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఘటనా స్థలాన్ని బట్టి చూస్తే బైక్‌ను ఏ వాహనం ఢీకొన్నట్లుగా లేదని అర్థమవుతోంది. అదుపుతప్పి పడటంతో వెనుక నుంచి వాహనం అతడిపైకి ఎక్కడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.150

సన్నవి : రూ.50

పండ్లు : రూ.30

Advertisement
 
Advertisement
Advertisement