● ఆటో డ్రైవర్‌పై దాడి
● మహిళా ప్రయాణికులపై దాడికి యత్నం
కావలి: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌పై దాడిచేసిన ఘటన మంగళవారం జలదంకి – గట్టుపల్లి క్రాస్‌రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలికి చెందిన కుప్పు సాయిసునీల్, షేక్ సుభాని జలదంకిలో మద్యం తాగి కావలి వైపు మోటార్‌బైక్‌పై వేగంగా వెళ్తున్నారు. ఇదే సమయంలో కావలి నుంచి బ్రాహ్మణక్రాకకు వెళ్తున్న ఆటోలో ముగ్గురు మహిళా ప్రయాణికులున్నారు. వీరు క్రాస్‌రోడ్డు వద్ద ఆగి కొబ్బరి బోండాలు, పండ్లు కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో అత్యంత వేగంగా సాయిసునీల్, సుభాని వేగంగా వచ్చి ఆటోను బైక్‌తో ఢీకొట్టి పడిపోయారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు ఆటో డ్రైవర్ ప్రవీణ్‌పై దాడిచేసి తరుముకున్నారు. అంతటి ఆగకుండా రాళ్లతో ఆటోను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. మహిళా ప్రయాణికులపై దాడి చేయబోయారు. స్థానికులు వారిని వారించగా యువకులు తిరగబడి దాడికి యత్నించారు. గందరగోళం చేసి కావలికి వస్తే మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే స్థానికులు ధైర్యం చేసి వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. జలదంకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశామని ఎస్సై లతీఫున్నీసా తెలిపారు. ఇద్దరిపై కావలిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పలు కేసులున్నట్లు వెల్లడించారు.


