పేదలు ఎదిగితే చంద్రబాబు సహించలేరు | - | Sakshi
Sakshi News home page

పేదలు ఎదిగితే చంద్రబాబు సహించలేరు

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

వెంకటాచలం: మోసాలు, అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు దిట్టని, తాను రాజ్యాధికారంలో ఉండాలంటే పేదలు ఎన్నటికీ పేదలుగా ఉండిపోవాలనేదే ఆయన భావజాలమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు.

‘జగనన్న కాలనీ.. చంద్రబాబు కహానీ’ కార్యక్రమ పేరిట వెంకటాచలంలోని జగనన్న కాలనీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. స్థానికులతో కలిసి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. జగనన్న పుణ్యం.. మీ సహకారంతోనే తమ సొంతింటి కల సాకారమైందని, జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు తమ ఆనందాన్ని కాకాణితో వ్యక్తపర్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. 2029లో జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను తమ పార్టీ అధినేత నెరవేర్చారని కొనియాడారు. 2014 – 19 మధ్య సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో పేదలు అనేక అర్జీలిచ్చినా, వాటిని పట్టించుకున్న దాఖలాల్లేవని విమర్శించారు.

పేదల సొంతింటి కల సాకారానికి జగనన్న కృషి

2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పేదల సొంతింటి కలను సాకారం చేసేలా నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల ఎకరాల ప్రభుత్వ.. 26 వేల ఎకరాల ప్రైవేట్‌ భూమిని కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. అప్పట్లో నిర్మించింది ఇళ్లు కావని.. ఊళ్లని.. గ్రామగ్రామాన ఉన్న జగనన్న లేఅవుట్లే దీనికి సాక్ష్యమని చెప్పారు. ఐదేళ్ల పాలనలో గృహ నిర్మాణ రంగంలో స్థలాల కోసం రూ.50 వేల కోట్లు.. నిర్మాణానికి రూ.50 వేల కోట్లు.. మొత్తంగా రూ.లక్ష కోట్లను వెచ్చించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు.

ఒక్కొక్కరికీ రూ.తొమ్మిది లక్షల ఆస్తి

వెంకటాచలంలోని జగనన్న కాలనీలో తొలి విడతలో ఏడెకరాలను కేటాయించి 260 మంది లబ్ధిదారులకు.. రెండో విడతలో మరో ఏడెకరాల్లో ప్లాట్లు వేసి పంపిణీ చేశామని వివరించారు. ఒక్కొక్కరికీ దాదాపు రూ.తొమ్మిది లక్షల విలువజేసే తొమ్మిదంకణాల స్థలాన్ని మంజూరు చేయడమే కాకుండా ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలతో పాటు అదనంగా వడ్డీలేని రుణం రూ.35 వేలు, ఉచిత ఇసుక ద్వారా రూ.15 వేలిచ్చి ఇంటి నిర్మాణానికి ప్రోత్సహించారని గుర్తుచేశారు. అయితే కొంతమందికి రావాల్సిన ఇళ్ల బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని హితవు పలికారు.

క్రెడిట్‌ చోరీలో చంద్రబాబు సిద్ధహస్తుడు

తన 21 నెలల పాలనలో 5.5 లక్షల ఇళ్లను నిర్మించామని చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్ధమని తెలిపారు. నాయుడుపేటలో ఇటీవల పర్యటించిన సమయంలో 2,50,893 ఇళ్లను ప్రారంభిస్తున్నారని ప్రకటించారని చెప్పారు. కూటమి పాలనలో మంజూరు చేసి నిర్మించిన ఒక్క ఇంటినైనా చూపాలని సవాల్‌ విసిరారు. తమ హయాంలో కట్టిన గృహాలను తన ఖాతాలో వేసుకొని క్రెడిట్‌ చోరీకి చంద్రబాబు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల పేరుతో ప్రజలను గతంలో మోసం చేసిన అంశాన్ని గుర్తుచేశారు. తమ హయాంలో నిర్మించిన ఇళ్లను తాను కట్టినట్లుగా చంద్రబాబు చెప్పుకొని ప్లయ్‌ఉడ్‌ నమూనా తాళాలివ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా అభివర్ణించారు. కల్లబొల్లి మాటలను కట్టబెట్టి జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. జగనన్న కాలనీల్లో పనులు చేస్తే తమ పార్టీ అధినేతకు పేరొస్తుందనే కుట్రతోనే చేయడంలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నిసార్లు సీఎం అయినా పేదలకు చేసిందేమీలేదని, అదే జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలోనే వారు చిరస్థాయిగా గుర్తుంచుకునే పనులు చేశారని చెప్పారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ మందా కవిత, వైస్‌ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, మండల కన్వీనర్‌ కొణిదెన మోహన్‌నాయుడు, ఎంపీటీసీ వేమారెడ్డి రఘునందన్‌రెడ్డి, చిట్టమూరు శివకుమార్‌రెడ్డి, జిల్లా నేత కొణిదెన విజయభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

2029లో జగనన్న రాజ్యం

రావడం ఖాయం

తమ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ రంగంపై రూ.లక్ష కోట్ల ఖర్చు

ప్రస్తుతం ఈ ఊసేలేదు

ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement