● రూ.2.05 లక్షల నగదు, 13 సెల్‌ఫోన్లు సీజ్
నెల్లూరు(క్రైమ్): ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును నెల్లూరు పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు సబ్ బుకీ, పంటర్లను అరెస్ట్ చేశారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలను ఎస్పీ అజిత మంగళవారం రాత్రి వెల్లడించారు. ఐపీఎల్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌లను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మాగుంట లేఅవుట్లోని కింగ్స్ కోర్టు గెస్ట్ ఇన్‌లో తనిఖీలను దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ కల్యాణరాజు తన సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి నిర్వహించారు. ఓ గదిలో క్రికెట్ బెట్టింగ్ యాప్ రాధే ఎక్స్చేంజ్ అడ్మిన్ ఫరియాజ్‌తో పాటు పంటర్లయిన అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన వాసు, ప్రవీణ్‌కుమార్, తోటపల్లిగూడూరుకు చెందిన మహేంద్రను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు సబ్ బుకీలు, పంటర్లయిన పొదలకూరు ప్రాంతానికి చెందిన శివకుమార్, రవికుమార్, లెనిన్ తేజ, మోహిత్, మస్తాన్, నవీన్‌కుమార్, నగరానికి చెందిన ప్రణీత్, మణికంఠను సోమవారం అదుపులోకి తీసుకొని అందర్నీ అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ 2,05,200 నగదు, 13 సెల్‌ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల్లో రూ.37 లక్షల ఆర్థిక లావాదేవీలు జరిగాయని గుర్తించి సదరు ఖాతాలను హోల్డ్ చేశారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వీరినీ త్వరలో అరెస్ట్ చేయనున్నామని ఎస్పీ తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన ఇన్‌స్పెక్టర్, సిబ్బంది, సైబర్ క్రైమ్ సిబ్బందిని అభినందించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. నగర ఏఎస్పీ దీక్ష తదితరులు పాల్గొన్నారు.


