పేదలపై ప్రతాపం.. పెద్దలపై ప్రేమ | - | Sakshi
Sakshi News home page

పేదలపై ప్రతాపం.. పెద్దలపై ప్రేమ

Feb 26 2026 7:32 AM | Updated on Feb 26 2026 7:32 AM

పేదలపై ప్రతాపం.. పెద్దలపై ప్రేమ

పేదలపై ప్రతాపం.. పెద్దలపై ప్రేమ

నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థలో పరిధిలో పన్నుల వసూళ్ల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సామాన్యుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, అదే బకాయిలున్న ప్రభుత్వ శాఖలు, బడాబాబుల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాలు, కుళాయి పన్నుల లక్ష్యం రూ.283.83 కోట్లు. కానీ సంస్థకు వసూలైన మొత్తం రూ.83.80 కోట్లకు పైనే.

ఎంతంటే..

ఆస్తి పన్నుకు సంబంధించిన ప్రైవేట్‌ అసెస్‌మెంట్లు 1,40,976 ఉన్నాయి. చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.203.91 కోట్లు. అయితే వసూలైంది రూ.73.46 కోట్లు మాత్రమే. అలాగే ఖాళీ స్థలాలకు సంబంధించి 7,556 అసెస్‌మెంట్లకు రూ.37.95 కోట్లు రావాలి. కానీ వచ్చింది రూ.7.03 కోట్లు. అదేవిధంగా 47,773 (మీటర్‌, నాన్‌ మీటర్‌ కలిపి) తాగునీటి కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా ఎన్‌ఎంసీకి రావాల్సిన మొత్తం రూ.64.32 కోట్లు. అయితే ఇప్పటికి వసూలు చేసింది రూ.19.53 కోట్లు మాత్రమే.

ప్రభుత్వ శాఖలపై ఉదాసీనత

కార్పొరేషన్‌ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి పన్నుల బాకాయిలు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ భవనాల అసెస్‌మెంట్లు 403 ఉన్నాయి. వీటి నుంచి రావాల్సిన మొత్తం రూ.35.17 కోట్లు. వచ్చింది రూ.3.28 కోట్లు మాత్రమే. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అసెస్‌మెంట్లు 220 ఉన్నాయి. రావాల్సిన పన్నుల మొత్తం రూ.6.77 కోట్లు. వచ్చింది రూ.3 లక్షలు మాత్రమే. అయితే సామాన్యులపై ఒత్తిడి తెచ్చి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై ఉదాసీన వైఖరితో ఉన్నట్లు విమర్శలున్నాయి. కేవలం నోటీసులిచ్చి పన్ను వసూళ్లను గాలికొదిలేశారని తెలిసింది.

వీరిని కూడా..

నగరపాలక సంస్థ పరధిలో భారీ భవనాలు నిర్మించుకున్న వారు సకాలంలో పన్నులు చెల్లించడం లేదని తెలుస్తోంది. టాప్‌టెన్‌లో బడాబాబులే ఉండటం ఇందుకు నిదర్శనం. వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ ప్రయత్నించినా తెలుగుదేశం నేతలు ఒత్తిళ్లు వస్తాయనే భయం అధికారులను వెంటాడుతోంది. ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది మరోసారి కూడా నేరుగా సంబంధిత యజమానులను కలిసి మాట్లాడినా ఫలితం లేదు. అంతేకాకుండా స్థానిక అధికార పార్టీ నేతల నుంచి ఫోన్‌లు చేయించి మళ్లీ కడతారని వారిని అడగొద్దని చెబుతుండటంతో మిన్నకుండి పోవాల్సి వస్తోందని పలువురు రెవెన్యూ సిబ్బంది లోలోన మదనపడుతున్నారు. కాగా కొన్నిచోట్ల డోర్‌ లాక్‌ ఉండటం కూడా సమస్యగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరికొద్దిరోజులే ఉంది. ఈలోగా వీరి నుంచి వంద శాతం వసూలు చేయడం అనుమానమే.

కష్టమే..

నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూలు కీలకం. ఆస్తి, నీటి పన్నులతోపాటు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల వసూళ్లు సక్రమంగా సాగాలి. అయితే నెల్లూరులో ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఈ దుస్థితి నెల కొనడం గమనార్హం.

పన్నుల వసూళ్ల విషయంలో

కార్పొరేషన్‌ తీరు ఇది

భారీగా పేరుకుపోయిన బకాయిలు

పేదలపై విరుచుకుపడుతూ..

బడాబాబుల జోలికి వెళ్లని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement