ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్‌కు కట్టబెట్టడం దారుణం
నెల్లూరు సిటీ: ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం దారుణమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టీవీ ప్రసాద్ మండిపడ్డారు. నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు సీఐటీయూ, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ల బుధవారం ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 డిపో బస్టాండ్ కొన్నేళ్లుగా రూరల్, ఇందుకూరుపేట, ముత్తుకూరు, అల్లూరు, కోవూరు, కొడవలూరు, తోటపల్లిగూడూరు తదితర ప్రాంతాల ప్రయాణికులకు సేవలందిస్తోందన్నారు. అయితే ప్రభుత్వం విద్యుత్ బస్సుల సాకుతో మూసివేయాలన్న నిర్ణయం సరికాదన్నారు. పూణేకి చెందిన పినాకిల్ ఎలక్ట్రిక్ సొల్యూషన్ కంపెనీకి డిపోకి చెందిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కట్టబెట్టేలా ఒప్పందం చేసుకోవడం దుర్మార్గమన్నారు. ఒప్పందాన్ని రద్దు చేసుకుని డిపోని యథావిధిగా నడపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి నాగేశ్వరరావు, నాయకులు కొండా ప్రసాద్, సుధాకర్, పెంచల నరసయ్య, కత్తి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


