ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
● అడ్డుకున్న అధికారులు, గ్రామస్తులు
వింజమూరు(ఉదయగిరి): మండలంలోని శంఖవరంలో సర్వే నంబర్ 208లో ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్రమించే ప్రయత్నం చేస్తుండగా బుధవారం గ్రామ తలారీతోపాటు మరికొందరు అడ్డుకున్నారు. దీంతో తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. ఆ సర్వే నంబర్‌లో 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో ఇద్దరికి 4 ఎకరాల డీ ఫారం పట్టా ఇచ్చారు. మిగిలిన భూమిని రెండేళ్ల నుంచి గ్రామానికి చెందిన వ్యక్తులు ఆక్రమించే ప్రయత్నం చేస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్డీఓ, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు వీఆర్వో రవితేజ తెలిపారు. అయినా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.


