లారీని ఢీకొట్టిన కారు
● ఏడుగురికి గాయాలు
వరికుంటపాడు: మండలంలోని జడదేవి గ్రామ సమీపంలో 565వ జాతీయ రహదారిపై సోమవారం లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పొదిలి నుంచి కడప వైపు లారీ వెళ్తోంది. ఏసుదాసు కుటుంబం అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి కారులో బెంగళూరుకు వెళ్లింది. శుభకార్యానికి హాజరై తిరిగి కనిగిరిలో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న ఏసుదాసు కుటుంబంలోని ఏడుగురిలో ముగ్గురికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎం.రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు.


