టీకేపాడు శోకసంద్రం...
ఆత్మకూరు: చేజర్ల మండలం తూర్పుకంభంపాడు గిరిజనకాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. కాలనీకి చెందిన గంధళ్ల సుధీర్ (16) శుక్రవారం అల్లూరు మండలం ఇస్కపల్లి బీచ్ వద్ద గల్లంతైన విషయం తెలిసి స్థానికులు విషాదంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన గంధళ్ల పెంచలయ్య వ్యవసాయ కూలి పనులు చేస్తుండగా, అతని భార్య ఆశా కార్యకర్తగా చిరుద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వ్యవసాయ పనులకు వెళ్తుండగా, చిన్న కుమారుడు సుధీర్‌ను తల్లిదండ్రులు చదివిస్తున్నారు. చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పలువురు మిత్రులు ఇసుకపల్లి సముద్ర బీచ్ వద్దకు వెళ్తామని చెప్పడంతో తల్లిదండ్రులకు చెప్పాడు. తొలుత వారు నిరాకరించారు. అనంతరం మిత్రులే చార్జీలు పెట్టి తీసుకొని వెళ్లినట్లు సమాచారం. అల్లూరు మండలంలోని వీరి మిత్రులు తోడవ్వడంతో అందరూ బీచ్ వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో నలుగురు గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు హుటావుటినా ఘటనా స్థలానికి వెళ్లారు. తమ కుమారుడిని చదివించి ఉన్నత స్థితిలో చూద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు సమాధి అయ్యాయి.


