మంత్రి అండదండలతోనే?
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇలాకాలో పచ్చ తమ్ముళ్ల అహంకారం హద్దులు దాటింది. హైకోర్టు ఆదేశాలను పూచిక పుల్లలా తీసిపడేశారు. చట్టం ముందు అధికార పార్టీ ఆదేశాలే శాసనంగా మారాయి. ఖాకీల కళ్ల ముందే కోళ్లు కత్తులు దూశాయి. నోట్ల కట్టలు చేతులు మారాయి. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాతే బాహాటంగా కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సైన్యం పహారాతో బరుల వద్దకు సెల్‌ఫోన్లు నిషేధించి విచ్చలవిడిగా పందేలు నిర్వహించారు. గోదావరి జిల్లాలకే పరిమితమైన కోడిపందేల సంస్కృతిని నెల్లూరు జిల్లాలోకి దిగుమతి చేసి, కోట్ల రూపాయల పందేలను బహిరంగంగా జరిపారు. జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పందెంరాయుళ్లను తరలించుకొచ్చి మరీ పందేలు సాగించడంపై జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు.
ఆత్మకూరు: హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఖాకీల మాటున ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం నాగులవెలటూరు వాగు సమీపంలో శుక్రవారం కూడా యథేచ్ఛగా కోడిపందేలు సాగాయి. బుధవారం కోడిపందేలు సాగిన విషయం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయినా అధికార పార్టీ నేతలు ఆగలేదు. ఖాకీలు అడ్డుకోలేదు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కేవలం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నియోజకవర్గంలో గోదావరి జిల్లాల తరహాలో కోడి పందేల బరులు ఏర్పాటు చేయడం పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ సైన్యంతో పక్కా నిఘా
బుధవారం జరిగిన పందేలపై ‘సాక్షి’ కథనంతో అప్రమత్తమైన నిర్వాహకులు, తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి.. మరింత ‘కట్టుదిట్టంగా’ అక్రమాలకు తెరలేపారు. బరుల వద్దకు వెళ్లే దారుల్లో ప్రైవేట్ వ్యక్తులతో బందోబస్తు ఏర్పాటు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి, సెల్‌ఫోన్లను లాక్కొని, ఒక్కో ఫోన్‌కు రూ. 20 వసూలు చేస్తూ ‘సమాంతర వ్యవస్థ’ను నడిపించారు. కోడి పందేల దృశ్యాలు బయటకు రాకుండా పక్కా ప్లాన్‌తో పందేలు కానిచ్చేశారు.
సరిహద్దులు దాటొచ్చిన పందెం రాయుళ్లు
జిల్లా నలుమూలల నుంచే కాకుండా, పొరుగున ఉన్న రాయలసీమ జిల్లాల నుంచి కూడా పందెం రాయుళ్లు వాహనాల్లో తరలివచ్చారు. నిఘా వర్గాల కళ్లు కప్పేందుకు వాహనాలను ఊరి చివర నుంచి పొలాల వద్ద అక్కడక్కడ నిలిపి, ఎవరికీ అనుమానం రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బరుల వద్ద కోట్లా ది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
ఆనం ఇలాకాలో తమ్ముళ్ల ‘బరి’ తెగింపు
బాహాటంగా పందెం బరులు
ప్రైవేట్ సైన్యంతో పహారా.. బరుల వద్దకు సెల్‌ఫోన్ల నిషేధం
కోట్లలో చేతులు మారిన పందెం సొమ్ము.. మామూళ్ల మత్తులో యంత్రాంగం
జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల నుంచి పందెంరాయుళ్ల రాక
ఒక వైపు కోడి పందేలపై కోర్టు ఆంక్షలు విధించినా జిల్లాలో మరెక్కడా లేని విధంగా కేవలం నాగులవెలటూరులోనే ఈ స్థాయిలో పందేలు జరగడం వెనుక అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీగా మామూళ్లు ముట్టాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్‌ను వివరణ కోరగా, ‘మొన్న జరిగాయి. ఈ రోజు జరగలేదు. ఈ విషయమై చేజర్ల ఎస్సైను తీవ్రంగా మందలించడం జరిగింది. మరోసారి జరగకుండా చూడాలని హెచ్చరించాం.’ అంటూ ఆయన ఇచ్చిన వివరణపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పందేలు రసవత్తరంగా సాగుతుంటే, ఉన్నతాధికారులకు సమాచారం లేదనడం వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ప్రజలు మండి పడుతున్నారు.
మంత్రి అండదండలతోనే?
మంత్రి అండదండలతోనే?
మంత్రి అండదండలతోనే?


