రూ.లక్షల్లో పైపందేలు
ఉదయగిరి: పచ్చనేతలు బరి తెగించారు. సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహించారు. బరుల నిర్వాహకులు పోలీసులకు మడుపులు ఇవ్వడంతో ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కోడి పందేలు, పై పందేల్లో రూ.లక్షలు చేతులు మారాయి. పండగ ముందు రోజు వరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు కోడి పందేలు నిర్వహిస్తే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ భోగి నాటికి చేతులు ఎత్తేశారు. ఉదయగిరి మండలం జి.చెరువుపల్లి సమీపంలోని కొండ ప్రాంతంలో పండగ మూడు రోజులు కోళ్ల పందేలు యథేచ్ఛగా సాగాయి. ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలు వారే కాకుండా బద్వేలు, మర్రిపాడు, దుత్తలూరు, సీతారామపురం తదితర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు తరలి వచ్చారు. నిర్వాహకులు ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని ఫొటోలు, వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పక్కనే మద్యం విక్రయాలు నిర్వహించారు. స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. కానిస్టేబుల్స్ పందెం జరిగే సమీప ప్రాంతానికి వచ్చి నిర్వాహకుడితో మాట్లాడి వెళ్లిపోడం విశేషం. దుంపవారిపల్లి, ఆర్లపడియ తదితర ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. వరికుంటపాడు మండలంలోని గణేశ్వరపురం, ఎన్‌బీ కాలనీ, మంగాపురం, బోయమడుగుల, విరువూరు కోటవర్ధనపల్లి, ఎన్.కొండాయపాళెం తదితర గ్రామాల్లో జోరుగా పందేలు జరిగినా పోలీసులు కన్నెత్తి చూడ లేదు. కలిగిరి మండలం వెంకన్నపాళెంలో కూడా మూడ్రోజులు జోరుగా కోడి పందేలు నిర్వహించారు. సీతారామపురం మండలం పబ్బులేటివారిపల్లి, దేవమ్మచెరువు, సీతారామపురం శివారు అటవీ ప్రాంతంలో నిర్వహించారు.


