పోలీస్ స్టేషన్లు టీడీపీ కార్యాలయాలుగా మార్చేశారు
● సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్
కార్యదర్శి కే నారాయణ
చిల్లకూరు: బాధితులకు అండగా నిలవాల్సిన పోలీస్‌స్టేషన్లను టీడీపీ కార్యాలయాలుగా మార్చేశారని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. చిల్లకూరు మండలంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న నక్కల కాలువ కండిగ్ర భూముల్లో తానే ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నారు. భూమిలో వరి సాగు చేయాలని పేదలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేద వానికి ఎక్కడా న్యాయం జరగడం లేదన్నారు. నక్కల కాలువ కండ్రిగలోని మిగులు భూములను పేదలు సాగు చేసుకుంటే వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరించడం దారుణమన్నారు. పేదలు సాగు చేసుకునేందుకు సిద్ధమైన భూమిని అధికార పార్టీ నాయకులు సాగు చేసుకుంటే వారిని మాత్రం ఏమి అనరు. భూములు ఏపీఐఐసీకి ఇచ్చినట్లు చెబుతున్నారని, అయినా సుమారు 10 ఎకరాల వరకు ఇంకా మిగులు భూమి ఉందన్నారు. ఇందులో పేదలు సాగు చేసుకుంటే పోలీసులకు వచ్చిన నష్టం ఏమిటని నారాయణ నిలదీశారు. ఈ భూములను టీడీపీ వారే ఆక్రమించుకునేందుకే పేదలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పేదలు సాగు చేసుకునే భూములను అడ్డుకుని ఇబ్బందులకు గురి చేస్తే పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో పాలన సరిగా లేదని దేనికై నా సిపార్సులు తీసుకుని పోవాల్సి వస్తుందని, ఎదిరిస్తే అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందన్నారు.


