మద్యం మత్తులో ఇద్దరి వీరంగం
● అడ్డుకున్న కానిస్టేబుళ్లపై దాడి
● అదుపులోకి తీసుకున్న పోలీసులు
కలిగిరి: పొద్దుపొద్దున్నే మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న చికెన్ దుకాణం వద్ద వీరంగం సృష్టించారు. అడ్డుకోబోయిన కానిస్టేబుళ్లపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కలిగిరి పోలీస్‌స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కలిగిరికి చెందిన సర్వేపల్లి బ్రహ్మయ్య, శేఖర్ మద్యం మత్తులో చికెన్ స్టాల్‌లో నాటుకోడి మాంసం కొనుగోలు విషయమై నిర్వాహకుడితో గొడవకు దిగారు. స్థానికులు సర్దిచెప్పబోగా వారితోనూ వాదనకు దిగారు. గొడవ జరుగుతున్న విషయం గమనించి స్టేషన్‌లోని కానిస్టేబుళ్లు దొరబాబు, అశోక్ వారికి సర్ది చెప్పడానికి చూశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయితే మద్యం మత్తు తలకెక్కిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపైనే దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు మందుబాబులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మద్యం మత్తులో పోలీసులపై తిరగబడడంతో మందుబాబులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మహాలక్ష్మమ్మ ఊరేగింపులో
అశ్లీల నృత్యాలు
● అనికేపల్లిలో హిజ్రాలతో
అభ్యంతరకర డ్యాన్సులు
● టీడీపీ నాయకుల అండతోనే అనుమతులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం అనికేపల్లిలో సంక్రాంతి ఉత్సవాల మాటున అశ్లీల నృత్యాలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నేతల అండదండలతోనే నిర్వాహకులు హిజ్రాలను తీసుకు వచ్చి దేవతామూర్తుల ఉత్సవాల్లో అసభ్యకర రీతిలో నృత్యాలు వేయించారు. పండగ వేళ పాడు పనులను చేయించారని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా అనికేపల్లి మహాలక్ష్మమ్మ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అయితే గ్రామోత్సవంలో మహిళలు సైతం ఉన్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్సవాల రూపు మారింది. హిజ్రాలు వచ్చి అశ్లీలంగా నృత్యాలు చేయడం కనిపించింది. ఈ ఊరేగింపునకు హాజరైన యువకులు కొందరు అశ్లీల నృత్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అనికేపల్లిలో అసభ్య నృత్యాల వ్యవహారం వైరల్ అయింది. స్థానికంగా ఉన్న ముఖ్య నాయకుడే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మద్యం మత్తులో ఇద్దరి వీరంగం


