పండగ వేళ.. విషాద ఘోష | - | Sakshi
Sakshi News home page

పండగ వేళ.. విషాద ఘోష

Jan 17 2026 7:28 AM | Updated on Jan 17 2026 7:28 AM

పండగ

పండగ వేళ.. విషాద ఘోష

అల్లూరు: వారంతా పండగ సంబరాలకు బంధువుల ఇళ్లకు వచ్చి సరదాగా గడుపుదామనుకున్నారు. ఒడ్డున ఆడుకుంటూ ఉండగా కనికరం లేని సముద్రుడు కబళించేశాడు. మండలంలోని ఇస్కపల్లి తీరంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అల్లూరు మండలం నార్త్‌ ఆములూరులోని గొల్లపాళెంలోని చైల్డ్‌ ఆశ్రమంలో చదువుకుంటున్న ఈగ అమ్ములు (14), ఈగ బాలకృష్ణ (15) అన్నాచెల్లెళ్లు. వీరు అల్లూరుపేటలో జరిగిన పోలేరమ్మ తిరునాళ్లకు వచ్చి, ఎర్రపుగుంటలోని తమ అన్న, వదిన ఇంటికి వెళ్లారు. అక్కడ తమ స్నేహితులైన ఇస్కపల్లి పంచాయతీ ఆదిరాఘవపురం ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన కొమరగిరి అభిషేక్‌ (16), చేజర్ల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న గంధళ్ల సుధీర్‌ (15), ఈగ చిన్నబయ్య, శిరసనంబేటి వెంకటేశ్వర్లుతో కలిసి సరదాగా గడుపుదామని శుక్రవారం మధ్యాహ్నం ఇస్కపల్లి సముద్ర తీరానికి వెళ్లారు.

విషాదం ఇలా జరిగింది

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆరుగురు యువకులు స్నానానికి సముద్రంలోకి దిగారు. అమ్ములు, బాలకృష్ణ, అభిషేక్‌, సుధీర్‌ ఒకవైపు.. మిగిలిన ఇద్దరు మరో వైపు స్నానం చేస్తున్నారు. అయితే సముద్ర గర్భంలోని లోతైన గుంతను గమనించని ఈ నలుగురూ ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. పక్కనే ఉన్న చిన్నబ్బయ్య, వెంకటేశ్వర్లు గమనించి కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు రంగంలోకి దిగారు. కొద్ది సేపటికే అమ్ములు మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. గాలింపు చేపట్టిన మత్స్యకారులకు బాలకృష్ణ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన అభిషేక్‌, సుధీర్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

అనాథలైన తోబుట్టువులు మరణం..

మృతి చెందిన అమ్ములు, బాలకృష్ణ అనాథలు కావడంతో వారి మరణం స్థానికులను తీవ్రంగా కలిచి వేసింది. తమ కళ్ల ముందే తోబుట్టువులను కోల్పోయి న మరో సోదరుడు చిన్నబ్బయ్య రోదనలు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించాయి. కాగా గల్లంతైన గంధళ్ల సుధీర్‌ తల్లిదండ్రులు, సోదరుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పండగ పూట చేతికి అందొచ్చిన పిల్లలు విగతజీవులుగా పడి ఉండడం చూసి ఆదిరాఘవపురం, అములూరు గ్రామా ల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పండగ ఆనందం కాస్తాం విషాదంగా మారిందని ఇస్కపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ

ఘటనా స్థలానికి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, డీఎస్పీ శ్రీధర్‌, సీఐ పాపారావు, ఎస్సై శ్రీనివాసరెడ్డి, మైరెన్‌ ఎస్సై శేషయ్య చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మత్స్యకారుల సాయంతో గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలింపు వేగవంతం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మైరెన్‌ పోలీసుల భద్రతా వైఫల్యమే..

పండగ పూట నలుగురు పిల్లలు సముద్రంలో మునిగి చనిపోవడానికి మైరెన్‌ పోలీసుల భద్రతా వైఫ్యలమే అని ఇస్కపల్లి వాసులు మండిపడుతున్నారు. వారాంత సెలవులతోపాటు పండగల వేళ ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారని, వారికి జాగ్రత్తలు చెప్పడంతోపాటు పర్యవేక్షించాల్సిన పోలీసులు విధుల్లో ఉండకపోవడం వల్లే ఈ విషాదం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇస్కపల్లి తీరంలో

నలుగురు బాలల గల్లంతు

అన్నా చెల్లెళ్ల మృతదేహాల లభ్యం

మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలింపు

మృతులందరూ గిరిజనులే

మూడు కుటుంబాల్లో సంద్రమంత విషాదం

పండగ పూట ఆ కుటుంబాల్లో అంతులేని కన్నీరు మిగిలింది. కడలి తీరంలో సరదాగా గడుపుదామని వెళ్లిన ఆ పసిపాదాలు.. అలల సుడిగుండంలో కలిసిపోయాయి. అన్నా చెల్లెళ్ల బంధం అలల ఘోషలో జల సమాధి అయింది. పండగ అంటేనే కొత్త బట్టలు, సరదా ముచ్చట్లు. కానీ ఆ సముద్రుడు వారి ఆశలను కనికరం లేకుండా కబళించేశాడు. లోకం తెలియని వయసు.. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని ప్రాయం.. ఆ నలుగురు బాలలు నీటిలో గల్లంతవడంతో ఇస్కపల్లి తీరం కన్నీటి సంద్రమైంది. చేతికి అందొచ్చే కొడుకులు, కూతురు లేరన్న నిజం ఆయా కుటుంబాల్లో సంద్రమంత విషాదం నెలకొంది. పండగ సంతోషాలు నిండాల్సిన వేళ, ఆ ఇళ్లలో గుండెలు పిండేసే విషాద ఘోష మిగిలింది.

పండగ వేళ.. విషాద ఘోష 1
1/4

పండగ వేళ.. విషాద ఘోష

పండగ వేళ.. విషాద ఘోష 2
2/4

పండగ వేళ.. విషాద ఘోష

పండగ వేళ.. విషాద ఘోష 3
3/4

పండగ వేళ.. విషాద ఘోష

పండగ వేళ.. విషాద ఘోష 4
4/4

పండగ వేళ.. విషాద ఘోష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement