వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
● ముగ్గురికి గాయాలు
జిల్లాలోని రహదారులు నెత్తురోడాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
ఆటోను బైక్ ఢీకొనడంతో..
సంగం: ఆటోను బైక్ ఢీకొనడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కొడవలూరు మండలం నాయుడుపాళేనికి చెందిన దాసరి పోలమ్మ(65), మరికొందరితో కలిసి పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలో గల ఆంజనేయస్వామి ఆలయానికి గురువారం రాత్రి వెళ్లారు. ఆపై అక్కడే నిద్రించారు. తెల్లవారుజామున స్నానం చేసిన అనంతరం కొడవలూరు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఈ తరుణంలో మండలంలోని తరుణవాయి వద్ద లారీని అధిగమించే క్రమంలో పొగమంచులో కనిపించక ఆటోను ఎదురుగా వస్తున్న ఓ బైక్ ఢీకొంది. ఘటనలో ఆటోలో కుడివైపు కూర్చొని ఉన్న పోలమ్మ తలకు గాయమైంది. వైద్యశాలకు తరలించేలోపే మృతి చెందారు. బైక్‌ను నడుపుతున్న తరుణవాయికి చెందిన వినయ్ స్వల్పంగా గాయపడ్డారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్సై రాజేష్ దర్యాప్తు చేస్తున్నారు.
జహీర్ (ఫైల్)
ఇందుకూరుపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని గంగపట్నంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మైపాడు చెందిన జహీర్ (23), కాలేషా పని నిమిత్తం గంగపట్నానికి బైక్‌పై వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ఓ పాదచారిని ఢీకొన్నారు. దీంతో బైక్ పైనుంచి వీరు కిందపడిపోగా, పాదచారి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులు కాలేషా, జహీర్‌ను మైపాడులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు.. ప్రాథమిక వైద్యం అనంతరం కాలేషాను 108లో నెల్లూరు తరలించారు. కాగా జహీర్ శరీరంపై పెద్దగా గాయాల్లేకపోవడం, మద్యం సేవించి ఉండటంతో ఏ ఇబ్బందీ ఉండదని భావించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకె ళ్లారు. గురువారం ఉదయం స్పృహలోకి రాకపోవడంతో హుటాహటిన నెల్లూరు.. ఆపై మెరుగైన వైద్యం నిమిత్తం చైన్నె తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందంటూ తిరిగి పంపేయడంతో, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎస్సై నాగార్జునరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి


