
బస్సు చక్రాల కింద నలిగిన ప్రాణం
నెల్లూరు(క్రైమ్): ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఓ వ్యక్తి బుధవారం రాత్రి మినీబైపాస్‌లోని మిలీనియం సబ్‌స్టేషన్ వద్ద ఉన్నాడు. ఆత్మకూరు బస్టాండ్ వైపు నుంచి వచ్చిన బస్సు యూటర్న్ తీసుకునే క్రమంలో అతడిని ఢీకొనడంతో కిందపడ్డాడు. వెనుక చక్రం నడుముపైకి ఎక్కడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు సమాచారం తెలియజేయాలని కోరారు.
సమ్మె విరమించాలని
బెదిరింపులు●
● మహిళను దూషించిన
నలుగురు వ్యక్తులు
● ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): సమ్మె విరమించాలని పబ్లిక్ హెల్త్ వర్కర్‌ను బెదిరించి, కులంపేరుతో దూషించి దాడిచేసిన వారిపై నెల్లూరు చిన్నబజారు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. కోటమిట్టలో ఎం.మయూరి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 22వ తేదీన ఆమె తన ఇంటి నుంచి కార్మికుల సమ్మెలో పాల్గొనేందుకు బయలుదేరారు. పుత్తా ఎస్టేట్ ఆర్చి సమీపంలో ఆమెను గోపీ, నవీన్, భాస్కర్, రాజేష్ అడ్డుకుని సమ్మె విరమించాలని బెదిరింపు చర్యలకు దిగారు. ఆమె వినకపోవడంతో కోపోద్రిక్తులైన వారు కులంపేరుతో దూషించి దాడి చేశారు. అంతటితో ఆగకుండా సమ్మెలో కనిపిస్తే అక్రమ కేసులు పెట్టి పనులు లేకుండా చేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. బాధితురాలు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై గురువారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
బస్సు అపహరణ కేసులో
నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): బస్సు అపహరణ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ పాయింట్‌లో ఉన్న ఆత్మకూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును బుధవారం తెల్లవారుజామున విడవలూరు మండలం కంచరపాళేనికి చెందిన బిట్రగుంట కృష్ణ అపహరించాడు. ఆత్మకూరు డిపో మేనేజర్ శివకేశవ యాదవ్ ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి నిందితుడిని అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా నిందితుడికి మతిస్థిమితం బాగోలేనట్లు వెల్లడించారు.
నిమ్మ చెట్లు తొలగించి
భూమి ఆక్రమణ
● నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన
కలువాయి(సైదాపురం): గిరిజనుల భూముల్లోని నిమ్మ చెట్లను తొలగించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య డిమాండ్ చేశారు. నిమ్మ చెట్ల తొలగింపును నిరసిస్తూ గురువారం కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులతో కలిసి ఆందోళన చేశారు. పెంచలయ్య మాట్లాడుతూ మండలంలోని బాలాజీరావుపేటకు చెందిన ఇండ్ల పెద వెంకయ్యతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన డీ–పట్టా భూమిలో సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను అదే గ్రామానికి చెందిన సిద్ధి వెంకటేశ్వర్లు కొందరితో తొలగించి పక్కనే ఉన్న బావిలో పడేశారని, బోరును సైతం ధ్వంసం చేసి భూమిని ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శ్యామ్‌సుందర్‌కు వినతిపత్రం ఇచ్చారు.