
సిబ్బంది లేక ఇబ్బంది
● మంత్రి ఇలాకాలో వైద్యశాలకు తాళాలు
అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని ప్రభుత్వ వైద్యశాలలో తగినంతమంది సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 24 గంటలు వైద్యసేవలు అందించాల్సి ఉండగా ఆ పరిస్థితి లేదు. ఇద్దరు వైద్యులున్నా సాయంత్రం 4 గంటల తర్వాత వారి గ్రామాలకు వెళ్లిపోతారు. వాచ్‌మెన్ తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. మరుసటిరోజు ఉదయం 9 గంటలకు తిరిగి ప్రారంభిస్తారు. గతంలో ఇద్దరు స్టాఫ్‌నర్సులు ఉండగా వివిధ కారణాలతో వారిని ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఒక స్టాఫ్ నర్సు పగలు విధులు నిర్వహిస్తోంది. ఇక్కడి దర్గాకు ఇతర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఆరోగ్యం బాగాలేకుంటే ఈ వైద్యశాలను ఆశ్రయిస్తుంటారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత తాళాలు వేస్తుండటంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి దారుణ పరిస్థితులున్నాయి.