రైల్లో దోపిడీ ఘటనలో ఆరుగురు దుండగులు
దోపిడీ ఘటనలో
దర్యాప్తు ముమ్మరం
● ఘటనా స్థలాలను
పరిశీలించిన రైల్వే ఎస్పీ
● సాంకేతిక, ఇతర సమాచారం ఆధారంగా దర్యాప్తు
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని అల్లూరురోడ్డు–పడుగుపాడు స్టేషన్ల మధ్య సిగ్నల్ ట్యాంపర్ చేసి రైల్లో దోపిడీకి పాల్పడిన ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అల్లూరురోడ్డు, పడుగుపాడు స్టేషన్ల సమీపంలో హోమ్ సిగ్నల్ ట్యాంపర్ జరిగిన ప్రాంతాలను గుంతకల్ జీఆర్పీ ఎస్పీ రాహుల్‌మీనా శనివారం పరిశీలించారు. సుమారు 2 గంటలకు పైగా ఘటనా స్థలాల్లోనే ఉండి అన్ని వివరాలు సేకరించారు. తొలుత అల్లూరురోడ్డు సమీపంలో గ్లూడ్ జాయింట్ వద్ద నాణెం ద్వారా సిగ్నల్ ట్యాంపర్ చేయడం, ట్రాక్ లీడ్ జంక్షన్ బాక్స్‌లతో వైర్లు కట్ చేసి సిగ్నల్స్‌ని ట్యాంపర్ చేసిన ప్రాంతాలను, అనంతరం పడుగుపాడు వద్ద కూడా సిగ్నల్స్ ట్యాంపర్ చేసిన ప్రాంతాలను పరిశీలించారు. సాంకేతిక నిపుణుల సహకారంతో దర్యాప్తునకు అవసరమైన కీలక సమాచారం సేకరించారు. స్టేషన్ ఔటర్లో చేపట్టిన నిఘా చర్యలు, సిగ్నల్ ట్యాంపర్ చేసే ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేసే విషయంలో సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ వెంట రైల్వే డీఎస్పీ, సీఐలు, సిబ్బంది ఉన్నారు.
నెల్లూరు సిటీ: జిల్లాలోని అల్లూరు రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన రైల్లో జరిగిన దోపిడీ ఘటనలో ఆరుగురు దుండగులు పాల్గొన్నారని, వారిలో ముగ్గురు నిందితులను గుర్తించినట్లు రైల్వే ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఇటీవల రైల్లో దోపిడీ జరిగిన ప్రాంతాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం నగరంలోని రైల్వే డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దుండగులు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దొంగతనం చేశారన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించినట్లు తెలిపారు. ఈ ముగ్గురు విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిలో ఒకరిని ప్రయాణికుడు ధ్రువీకరించారన్నారు. రైలులో రాజస్తాన్, ఢిల్లీ, హరియాణాకు చెందిన ప్రయాణికులు ఉన్నారని, వారిని కూడా విచారిస్తున్నామన్నారు. దొంగతనం జరిగిన తీరును బట్టి నిందితులు ఆరుగురు ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. కొందరు ట్రాక్‌పై ఉండి, రైల్లో రెండు చైన్ స్నాచింగ్, రెండు బ్యాగు దొంగతనాలు జరిగాయన్నారు. కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇప్పటికే నెల్లూరు జీఆర్పీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో నేరాలు జరిగాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రైల్వే డీఎస్పీ మురళీధర్ పాల్గొన్నారు.
ముగ్గురిని గుర్తించాం, త్వరలో కేసును ఛేదిస్తాం
రైల్వే ఎస్పీ రాహుల్‌మీనా


